Maldives: దయచేసి మాల్దీవులకు రండి
దెబ్బకి దయ్యం దిగొచ్చింది. నోరు ఉంది కదా అని పారేసుకున్న భారతీయులు మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్ అభ్యర్థించారు. ఆయన సోమవారం పీటీఐతో మాట్లాడుతూ భారత్, మాల్దీవులు మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ దేశ ప్రభుత్వం భారత్‌లో కలిసి పనిచేయాలని అనుకొంటున్నదని, తాము ఎల్లప్పుడూ శాంతియుత, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటామని చెప్పారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి.. బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పును తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది.
దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీమ్ ఫైజల్ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. ‘మనకు ఓ చరిత్ర ఉంది.. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా (భారత్‌తో) కలిసి పనిచేయాలని కోరుకుంటోంది.. మేము ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం... భారతీయుల రాకపోకలకు మా ప్రజలు, ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతున్నాయి... దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగస్వామ్యం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులకు చెప్పాలనుకుంటున్నాను.. మా ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంది’ అని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com