Abdulla Shahid: ముయిజ్జువి అన్నీ అబద్ధాలే: మాల్దీవుల మాజీ మంత్రి అబ్దుల్లా

తమ దేశంలో వేలాది మంది భారతీయ సైనికులు ఉన్నారంటూ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు. అధ్యక్షుడు చెప్పిన అసత్యాలలో ఇదొకటని వ్యాఖ్యానించారు. తమ దేశంలో విదేశీ సాయుధ సైనికులు ఎవరూ లేదని షాహిద్ అన్నారు. ‘మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
సరైన గణాంకాలను కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. ప్రభుత్వం పారదర్శకత పాటించడం ముఖ్యమని, సత్యమే గెలుస్తుందని షాహిత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే ముయిజ్జు ఇలాంటి అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ఆయన 100 రోజుల పాలనలో అనేక అబద్ధాలను ప్రచారం చేశారని, అందులో ఇదీ ఒకటని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (MDP) వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయిజ్జు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నినాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎండీపీ విమర్శించింది. అయితే భారత్‌తో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారని అబ్దుల్లా షాహిద్ అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే ముయిజ్జు అదేపనిగా అబద్ధాలు వల్లెవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మాల్దీవుల నుంచి భారత దళాలను పంపించి వేస్తామని అధ్యక్షుడు ముయిజ్జు నాయకత్వంలోని పార్టీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజునే బలగాలను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని ముయిజ్జు కోరిన విషయం తెలిసిందే. నిజానికి మాల్దీవులలో భారత సైనికులు ఎక్కువ సంఖ్యలో లేరు. ‘డోర్నియర్ 228 సముద్ర గస్తీ విమానం, రెండు హెచ్ఏఎల్ ధృవ్ హెలికాప్టర్లు, సుమారు 70 మంది భారత సైనికులు మాత్రమే అక్కడ ఉన్నట్టుగా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com