Maldives: మాల్దీవులు అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం

Maldives: మాల్దీవులు అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం
భారత్‌తో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ముయిజ్జూపై ఆగ్రహజ్వాలలు

మాల్దీవులు పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య గొడవతో అక్కడి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జుకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ఎండీపీ, డెమొక్రాట్స్‌ సిద్ధమవుతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది . అంతేగాక సోమవారం పార్లమెంట్‌లో మయిజ్జు సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు అనుకూలంగా వ్యవహరించే నలుగురు సభ్యులను మయిజ్జు సర్కార్‌ క్యాబినెట్‌లోకి తీసుకోగా, ఇందులో ముగ్గురు సభ్యుల్ని క్యాబినెట్‌లోకి తీసుకోవటాన్ని పార్లమెంట్‌ తిరస్కరించింది.

మాల్దీవుల పార్లమెంట్‌లో ఎండిపికి ఆధిక్యం ఉంది. చైనా అనుకూల అధ్యక్షుని మంత్రివర్గంలో నలుగురు సభ్యులకు ఆమోదముద్రపై విభేదాల నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల ఎంపిలు, ప్రతిపక్షఎంపిల మధ్య ఆదివారం పార్లమెంట్‌లో ఘర్షణలు చోటు చేసుకోగా సోమవారం ఈ పరిణామం చోటు చేసుకున్నది. అధ్యక్షుడు ముయిజ్జు మంత్రివర్గ సభ్యులు నలుగురికి వోటింగ్‌కు ముందు పార్లమెంటరీ ఆమోదాన్ని నిలిపివేయాలని మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండిపి), డెమోక్రాట్స్ పార్లమెంటరీ గ్రూప్ నిర్ణయించిన తరువాత అధికార పార్టీ మాల్దీవుల ప్రగతిశీల పార్టీ, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిపిఎం/ పిఎన్‌సి) కూటమి నిరసనకు దిగగాపార్లమెంటరీ సమావేశానికి అంతరాయం కలిగింది. ‘డెమోక్రాట్స్ భాగస్వామ్యంతో ఎండిపి అభిశంసన తీర్మానం కోసం తగినన్ని సంతకాలు సేకరించింది. అయితే, వారు దానిని ఇంకా సమర్పించవలసి ఉంది’ అని ఎండిపి ఎంపిని ఉటంకిస్తూ సన్.కామ్ తెలియజేసింది. అభిశంసన తీర్మానాన్ని సమర్పించాలని సోమవారం ఎండిపి పార్లమెంటరీ గ్రూప్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ది ఎడిషన్.ఎంవి తెలియజేసింది.

అంతకుముందు జనవరి 8న పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా అధ్యక్షుణ్ని గద్దె దించాలని కోరారు. మాల్దీవులు విదేశాంగ విధాన స్థిరత్వాన్ని నిలబెట్టడానికి, పొరుగు దేశాలకు దూరం కాకుండా ఉండేందుకు ఇదెంతో అవసరమని అజీమ్ నొక్కిచెప్పారు. అభిశంసన తీర్మానం విషయమై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాదోపవాదనలతో మాల్దీవులు పార్లమెంట్ అట్టుడుకుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటనకు సంబంధించిన ఫోటోలపై మాల్దీవులు డిప్యూటీ మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రధాని మోదీని హస్యకాడు, ఇజ్రాయెల్ కీలుబొమ్మగా ఆమె అభివర్ణించారు. ఆ తర్వాత మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు సైతం ఇదే తరహాలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయులు బాయ్‌కాట్ మాల్దీవులు అని పిలుపునిచ్చారు.

మాల్దీవులు మంత్రుల వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి. దీంతో మాల్దీవులు ప్రభుత్వం దిగొచ్చింది. మోదీపై, భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది. మరుసటి రోజే మాల్దీవులు రాయబారిని పిలిపించిన భారత విదేశాంగ శాఖ.. ఆయనతో మాట్లాడింది.

భారత్‌తో వివాదం నేపథ్యంలో.. మాల్దీవులు రాజధాని మాలే మేయర్ పీఠం కోసం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడు ముయిజ్జూకు చెందిన చైనా అనుకూల పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) ఓటమిపాలైంది. అప్పటి దాకా ముయిజ్జూ మాలే మేయర్‌గా వ్యవహరించగా.. ప్రతిపక్ష ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఆ పీఠాన్ని సొంతం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story