Mohamed Muizzu: భారత బలగాలు దేశం వీడాల్సిందే-మాల్దీవుల అధ్యక్షుడు

Mohamed Muizzu: భారత బలగాలు  దేశం వీడాల్సిందే-మాల్దీవుల అధ్యక్షుడు
మే 10 నాటికి వెనక్కి వెళ్లాల్సిందేనన్న మొయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా భారత వ్యతిరేక వైఖరిని మాత్రం వదలిపెట్టడం లేదు. తమ దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అందులో జోక్యం చేసుకొనేందుకు ఏ దేశాన్ని అనుమతించేది లేదని ముయిజ్జు ఆ దేశ పార్లమెంటులో సోమవారం స్పష్టం చేశారు. భారత బలగాలు మే 10నాటికి మాల్దీవులను వీడేందుకు ఇరు దేశాలూ ఇప్పటికే అంగీకారానికి వచ్చాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో భారత్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.

భారత బలగాలకు సంబంధించి తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాలను మార్చి 10 నాటికి వదిలిపెట్టాలని, మిగతా రెండు మే 10 తేదీకి ఖాళీచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘దేశ అంతర్గత, ప్రాదేశిక జలాల్లో సైనికులను కొనసాగించేలా భారత్‌తో ఒప్పందాన్ని మాల్దీవులు పునరుద్ధరించదు. మా సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి లేదా అణగదొక్కడానికి మేం ఏ దేశాన్ని అనుమతించబోం’ అని ప్రకటన చేశారు.

అయితే, ఆయన ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమొక్రాట్స్‌ బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో ముయిజ్జు ఖాళీ కుర్చీలకు తన ప్రసంగాన్ని వినిపించారు. ముయిజ్జు ప్రసంగం సమయంలో సభలో కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సభలో ఆయన మాట్లాడుతూ.. రెండు దశలుగా తమ దేశంలోని భారత బలగాలు వెనక్కి వెళ్లిపోతాయని వెల్లడించారు.

మాల్దీవ్స్‌లో ఉన్న మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలు మార్చి 10 లోగా వెళ్లిపోతాయని తెలిపారు. మిగతా రెండు స్థావరాల్లో ఉన్న భారత దళాలు మే 10 నాటికి వైదొలుగుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించుకోవడం లేదని ముయిజ్జు వెల్లడించారు. తమ సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని తాము అనుమతించబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

మాల్దీవులకు మానవతా సేవలను అందించే భారతీయ వైమానిక స్థావరాల్లో నిరంతర కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇరు దేశాలు పరస్పరం అంగీకరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో తెలిపింది. కానీ, అందుకు విరుద్దంగా మాల్దీవుల అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రెసిడెంట్ మొయిజు భారత వ్యతిరేక వైఖరి స్వదేశంలో విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం చైనాకు చేరువైన నేపథ్యంలో తీవ్రంగా మండిపడుతున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే చైనా పర్యటనకు వెళ్లి జిన్‌పింగ్‌ను కలిశారు. ఇది భారత్- మాల్దీవుల సాంప్రదాయకంగా సన్నిహిత సంబంధాల్లో కీలక పరిణామం.

Tags

Read MoreRead Less
Next Story