USA: మినియాపోలిస్ లో మరోసారి ICE కాల్పులు..ఓ వ్యక్తి మృతి

మినియాపోలిస్ లో వరుస కాల్పులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జనవరి 7న రెనీ గుడ్ అనే 35ఏళ్ళ ఆమెపై ICE అధికారి ఒకరు కాల్పులు జరిపారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఫెడరల్ ఏజెంట్లు మరో వ్యక్తిపై గన్ ఫైరింగ్ చేశారు. 37 ఏళ్ళ అలెక్స్ జెఫ్రీ అనే వ్యక్తిని పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఇతను అమెరికా పౌరుడు. కాల్పులు సంఘటన జరిగిన ప్రదేశంలో చట్టవిరుద్ధమైన సమావేశం జరుగుతోందని...అక్కడి నుంచి జనాలను వెళ్ళిపోవాలని అధికారులు పదే పదే ఆదేశించారని పోలీసులు చెబుతున్నారు.మినియాపోలిస్ ను నాశనం చేయవద్దని చాలా సార్లు చెప్పామని అంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద తుపాకీ, బుల్లెట్లు కనిపించాయని..అతను ఫెడరల్ అధికారులపై తిరగబడ్డానికి ప్రయత్నం చేశాడని...అందుకనే కాల్పులు జరిపామని చెబుతున్నారు.
శనివారం ఉదయం వెస్ట్ 26వ వీధి, నికోలెట్ అవెన్యూ సౌత్ సమీపంలో కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలెక్స్ జెఫ్రీని చుట్టుముట్టి నేలపై పడవేసిన అధికారులు...తరువాత కాల్పులు జరిపారు. కానీ హెంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ట్రిసియా మెక్ లాఫ్లిన్ మాట్లాడుతూ.ఫెడరల్ అధికారులు అక్రమవలసలపై ఆపరేషన్ నిర్వహిస్తుండగా...అధికారులకు దగ్గరకు జెఫ్రీ వచ్చి తుపాకీతో బెదిరించాడని...అందుకే కాల్పులు జరిపామని చెప్పారు. అతని దగ్గర తుపాకీకు సంబంధించిన లైసెన్స్ లేదని చెబుతున్నారు.
ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం నుంచి హింసాత్మక, శిక్షణలేని అధికారులను తక్షణం వెనక్కి తీసుకోవాలని ట్రంప్ సర్కారును డిమాండ్ చేశారు. ఇటీవల రీనీ గుడ్ అనే మహిళ కాల్చివేత నేపథ్యంలో మినియాపోలిస్ లో భారీగా నిరసనలు జరుగుతున్నాయి. తాజా కాల్పుల అనంతరం కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఫెడరల్ అధికారులపై మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
