Trump-Machado: ట్రంప్‌కు నోబెల్ అందజేసిన వెనెజువెలా విపక్ష నేత మచాడో

వెనెజువెలా విపక్ష నేత, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తన నోబెల్ బహుమతి పతకాన్ని బహూకరించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి తొలగించడంలో ట్రంప్ చూపిన చొరవకు కృతజ్ఞతగా ఈ బహుమతిని సమర్పించినట్లు ఆమె వెల్లడించారు.
గురువారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో మారియా మచాడో సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. "మా స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన అసమాన నిబద్ధతకు గుర్తింపుగా ఈ నోబెల్ పతకాన్ని ఆయనకు అందించాను" అని ప్రకటించారు. అయితే, ట్రంప్ ఈ పతకాన్ని భౌతికంగా స్వీకరించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
ఈ పరిణామంపై నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్ స్పందించింది. బహుమతి పతకాన్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవచ్చని, కానీ నోబెల్ గ్రహీత హోదాను మాత్రం బదిలీ చేయడం, పంచుకోవడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కాగా, "ఈ బహుమతి వెనెజువెలా ప్రజలది. దీనిని ట్రంప్‌తో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం" అని మచాడో గతంలోనే వ్యాఖ్యానించారు.
నోబెల్‌ను అలా ఇవ్వొచ్చా..?
తనకు లభించిన శాంతి బహుమతిని అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇస్తానని మచాడో చెప్పడంపై నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల స్పందించింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత.. దానిని రద్దు, బదిలీ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది. కమిటీ నిర్ణయమే అంతిమమని, దీనిలో ఎటువంటి మార్పు ఉండబోదని, ఎప్పటికీ ఇదే వర్తిస్తుందని పేర్కొంది. అయినప్పటికీ మచాడో తన నోబెల్ బహుమతిని ట్రంప్‌నకు ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆ మెడల్‌ను ట్రంప్ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారి వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

