Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక

కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో మార్క్ కార్నీని అధికార లిబరల్ పార్టీ ఎన్నుకుంది. మార్క్ కార్నీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాకుండా మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా లేదు. అనూహ్యంగా కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక కావడం విశేషం. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించారు. దీంతో లిబరల్ పార్టీలో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది.
59 ఏళ్ల మార్క్ కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు ముగింపు పలికినట్లైంది. 1965లో ఫోర్ట్ స్మిత్‌లో మార్క్ కార్నీ జన్మించారు. హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. మార్క్ కార్నీ.. గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్‌గా పని చేశారు. 2008 నుంచి 2013 వరకు బ్యాంక్ ఆఫ్ కెనడా 8వ గవర్నర్‌గా పనిచేశారు. 2013 నుంచి 2020 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 120వ గవర్నర్‌గా కూడా పని చేశారు. ఆర్థిక విషయాలపై సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు.
ఓటింగ్‌లో 1,52,000 మంది పాల్గొన్నారు. కార్నీకి 86 శాతం ఓట్లు రావడంతో తదుపరి కెనడా ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అమెరికా.. కెనడాపై అధికంగా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించింది. అయితే మార్క్ కార్నీ.. ఆర్థిక అంశాలపై అనుభవం కలిగిన వ్యక్తి.. ఈ నేపథ్యంలో కార్నీనే కెనడాను దారిలో పెట్టగలరని ట్రూడో భావించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com