Anju Returned India: భారత్‌కు తిరిగొచ్చిన అంజూ

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడే రెండోపెళ్లి చేసుకున్న రాజస్థాన్ యువతి తిరిగి భారత్‌కు వచ్చింది. అట్టారి వాఘా బోర్డర్ నుంచి ఆమె భారత్‌లోకి బుధవారం స్వదేశంలోకి అడుగుపెట్టింది. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి.. ఎవరికీ చెప్పా పెట్టకుండా పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన అంజూ.. మళ్లీ తిరిగి భారత్‌కు వచ్చేసింది. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను కలవడానికే వెళ్లానంటూ మొదట్లో చెప్పిన అంజూ.. ఆ తర్వాత అతడినే పాక్‌లో పెళ్లి చేసుకుంది కూడా. ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆమె వ్యవహారం, బుధవారం రాత్రి భారత్‌కు తిరిగి రావటం తో మళ్లీ మరోసారి తెరపైకి వచ్చింది.
రాజస్థాన్‌లోని భీవాడీ జిల్లాకు చెందిన అరవింద్ అనే వ్యక్తితో అంజూకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది. ఆమెకు 15 ఏళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. అయితే అంజూకు ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్‌కు చెందిన నస్రుల్లాతో పరిచయం అయింది. 2019వ సంవత్సరం నుంచి మెసేజ్‌లతో మొదలయిన వ్యవహారం చివరకు ప్రేమాయణానికి దారి తీసింది. ఉన్నట్టుండి సడన్‌గా ఈ ఏడాది జూలై నెల 27వ తారీఖున భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన సంగతి సోషల్ మీడియా ద్వారానే భర్తకు తెలిసింది.
తాను కేవలం స్నేహితుడిని కలిసేందుకు మాత్రమే వచ్చాననీ.. మళ్లీ వెనక్కు వెళ్లిపోతానని మొదట్లో అంజూ చెప్పినప్పటికీ.. అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఫేస్‌బుక్ ఫ్రెండ్ నస్రుల్లానే ఆమె పెళ్లి చేసుకుంది. పేరును ఫాతిమాగా మార్చుకుంది. వీరిద్దరి ప్రేమపెళ్లికి బహుమతిగా అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారి మొహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమిని, డబ్బును కూడా ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఆమె ఇక తిరిగి రాదు అని నిశ్చయింంచుకున్న భర్త అరవింద్.. పిల్లల భవిష్యత్తు కోసం రోజూ కూలి పనులకు వెళ్తూనే ఉన్నాడు. మరోవైపు నస్రుల్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అంజూ తిరిగి భారత్‌కు వస్తుందని చెప్పాడు. ఆమె తన ఇద్దరు పిల్లలపై బెంగ పెట్టుకున్నట్లు అతడు వెల్లడించాడు. ఆమె పిల్లలను కలిసేందుకు భారత్‌లోని ఇంటికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంజూ వెంటన తాను కూడా భారత్‌కు వచ్చేందుకు సిద్ధపడ్డానన్నాడు. అయితే వీసా విషయంలో ఇబ్బంది కారణంగా రాలేకపోయినట్లు తెలిపాడు.
అయితే పాకిస్తాన్, పంజాబ్ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా భారత్లోకి ఆమె బుధవారం రాత్రి ప్రవేశించింది. అయితే వాఘా బోర్డర్ వద్ద దర్యాప్తు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ క్యాంప్ వద్ద ఆమెను విచారించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను అమృత్ సర్ విమానాశ్రయానికి తీసుకెళ్లిన అధికారులు.. విమానంలో ఢిల్లీకి తరలించారు.
కాగా.. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన అంజూ.. తాను భారత్‌కు ఎందుకు తిరిగొచ్చానన్నది వెల్లడించింది. ‘నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం. నా కొడుకు, కూతురు లేకుండా ఉండలేకపోతున్నాను. అక్కడ నాకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినప్పటికీ పిల్లలు పదే పదే గుర్తుకు వస్తున్నారు. వారిని నా వద్దకు తీసుకెళ్లాలని తిరిగి వచ్చాను. నా పిల్లలను నా వెంట తీసుకెళ్తాను. అదే సమయంలో నా భర్తకు కూడా విడాకులు ఇస్తాను. చట్టపరంగా చేయాల్సిన పనులను చేయడానికే భారత్‌కు తిరిగి వచ్చాను..’ అంటూ అంజూ తేల్చిచెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com