Pakistan: భారత దాడిలో మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నం- జైషే ఉగ్రవాది

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత వారం పాకిస్తాన్‌లోని బాలాకోట్ తహసీల్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం ఉగ్రవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్‌పై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. భారత్ ‘‘అజర్ కుటుంబాన్ని హతమార్చింది’’ని కాశ్మీరీ అంగీకరించారు.
2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక దళ స్థావరంపై , జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీలోని ఆర్మీ శిబిరంపై జరిగిన రెండు దాడులతో సహా భారతదేశంపై బహుళ ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నత స్థాయి సభ్యుడు మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్‌గా మారింది.
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ముద్రవేయడాన్ని కాశ్మీరీ తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ తరుపున ఉగ్రవాదానికి పాల్పడ్డామని ఇతను అంగీకరించాడు. ‘‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ (పాకిస్తాన్) సరిహద్దులను రక్షించడానికి మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాము. అన్నింటినీ త్యాగం చేసిన తర్వాత, మే 7న, బహవల్‌పూర్‌లో భారత దళాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేశాయి’’ అని కాశ్మీరీ చెబుతున్నట్లు వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
భారత మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్:
మసూద్ అజార్ భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరు. 2001 పార్లమెంట్ అటాక్, 26/11 ముంబై దాడుల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉంది. 2019లో ఐక్యరాజ్యసమితి ఇతడిని ప్రపంచ ఉగ్రవాదిగా నియమించింది. 1999లో ఇండియన్ ఎయిల్ లైన్స్ IC-814 కాందహార్ హైజాక్ తర్వాత, ఇతడిని భారత్ విడిచిపెట్టింది. అప్పటి నుంచి పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతూ, భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com