NASA: బెన్నూ గ్రహశకల నమూనాను ఆవిష్కరించనున్న నాసా

కోట్ల కిలోమీటర్ల దూరంలోని బెన్నూ గ్రహశకలం నుంచి భూమిపైకి తీసుకొచ్చిన నమూనాలను నాసా ఆవిష్కరించబోతోంది. 450 కోట్ల ఏళ్ల పురాతమైన ఈ నమూనాలను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఆవిష్కరించనుంది. ఈ శాంపిల్స్ మానవాళికి ఎంతో ఉపయోగపడతాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చెబుతోంది. సౌరకుటుంబంలోని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్నూ గ్రహశకలం నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నమూనాలను నాసా ఆవిష్కరించనుంది. సెప్టెంబర్‌లో భూమిపైకి తీసుకొచ్చిన ఈ శాంపిల్స్‌ను ఉటా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ ల్యాబ్‌లోని అత్యంత శుభ్రమైన గదిలో సురక్షితంగా ఉంచింది. తీసుకొచ్చిన క్యాప్స్యూల్‌లోనే దీన్ని ఇంకా ఉంచింది. ఈ శాంపిల్స్‌లో గ్రహశకలానికి చెందిన ధూళితోపాటు ఇతర శిలలు ఉన్నాయి. ఇవి 450 కోట్ల సంవత్సరాల క్రితం, సౌరవ్యవస్థ పుట్టుక ప్రారంభం నాటివని శాస్త్రవేత్తలు తెలిపారు.
వీటిని అధ్యయనం చేస్తే జీవం, గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ బెన్నూ గ్రహశకలం నుంచి భూమికి ముప్పు పొంచి ఉంది. 2182వ సంవత్సరంలో ఇది భూమిని ఢీకొట్టే అంత చేరువలోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని శిలల అధ్యయనం ద్వారా.. ఇతర గ్రహశకలాలు ఢీకొట్టే ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉందని తెలిపారు. బెన్నూ.. ఓ భారీ గ్రహశకలం నుంచి విరిగిపోయిన ఒక ముక్క అని నాసా తెలిపింది. దీని పరిమాణం అరకిలోమీటర్ ఉంటుంది.ఇది క్రేటర్‌లు పర్వతాలతో నిండి ఉంటుంది. అయితే దీని ఉపరితలం చాలా మెత్తగా ఉంటుందనీ.. వ్యోమనౌకలోని వాక్యూమ్ ఆర్మ్ పరికరం దీనిని తాకినప్పుడు అది ఒక అడుగులోపలికి వెళ్లిందని నాసా పేర్కొంది. అందుకే నిర్దేశించిన దానికన్నా ఎక్కువ శాంపిల్స్‌ను స్పేస్‌క్రాఫ్ట్ సేకరించగలిగింది.
బెన్నూ నమూనాలతో కూడిన అంతరిక్ష క్యాప్స్యూల్ సెప్టెంబర్‌లో అమెరికాలోని ఉటా మిలిటరీ టెస్ట్, ట్రైనింగ్ రేంజ్‌లో సురక్షితంగా దిగింది. ఈ స్పేస్ క్యాప్స్యూల్ మొత్తంగా 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. గ్రహశకల నమూనాను భూమిపైకి తీసుకురావడం నాసాకు ఇదే తొలిసారి. 2016లో ఓసిరిస్ రెక్స్‌ను నాసా ప్రయోగించింది. రెండేళ్ల తర్వాత వ్యోమనౌక బెన్నూను చేరింది. 2020లో గ్రహశకల ఉపరితలం నుంచి దుమ్ము, రాళ్లను సేకరించి.. భూమివైపు ప్రయాణించింది. భూమికి లక్ష కిలోమీటర్ల దూరంలో వ్యోమనౌక నుంచి విడిపోయిన క్యాప్స్యూల్ సెప్టెంబర్‌లో భూమిని చేరింది. ఈ మిషన్ కోసం నాసా వంద కోట్ల డాలర్లు వెచ్చించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com