US Floods: న్యూయార్క్, న్యూజెర్సీని ముంచెత్తిన భారీ వరదలు

అగ్రరాజ్యం అమెరికాలో వరదల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న టెక్సాస్, మెక్సికోలను వరదలు ముంచెత్తాయి. టెక్సాస్‌లో 100 మందికి పైగా చనిపోగా.. మెక్సికోలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే న్యూయార్క్, న్యూజెర్సీని వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కార్లు, ప్రజలు, వస్తువులు కొట్టుకుపోయాయి. ప్రధాన రోడ్లన్నీ మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక భారీ వర్షాలు, వరదలు కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో తుఫాను బీభత్సం సృష్టించడంతో గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం రైళ్లు, విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయి.
ఇక న్యూయార్క్‌లో ప్రజలను ఎత్తైన ప్రాంతాల్లో ఉండాలని అధికారులు కోరారు. ఇక సబ్‌వే సేవలు నిలిచిపోయాయి. ఆకస్మిక వరదలు కారణంగా రైల్వే స్టేషన్లు నీళ్లతో నిండిపోయాయి. ప్రయాణికులు కూడా మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com