Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. రాజకీయ నేత ఫజోర్ అలీ అరెస్ట్!

Bangladesh:  బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. రాజకీయ నేత ఫజోర్ అలీ అరెస్ట్!
X
ఘటనను వీడియో తీసి ప్రచారం చేసినందుకు అదుపులో మరో ముగ్గురు

బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 21 ఏళ్ల హిందూ మహిళ పై స్థానిక రాజకీయ నేత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూన్‌ 26న చోటు చేసుకుంది. ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) సభ్యుడు 38 ఏళ్ల ఫిరోజ్‌ అలీ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లి తలుపుకొట్టాడు. ఆమె తలుపు తీసేందుకు నిరాకరించడంతో తోసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అయితే, వారి నుంచి అలీ తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు జూన్ 27న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మురాద్‌నగర్ పోలీసులు.. ఉదయం 5 గంటలకు ఢాకాలోని సయదాబాద్ ప్రాంతంలో ఫిరోజ్‌ అలీని అరెస్టు చేశారు. అతడితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ అమానుష ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘డైరెక్ట్ యాక్షన్’ తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుంచి హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయని స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story