World ugliest dog : అందంగా లేకపోవటమే అదృష్టం

World ugliest dog : అందంగా లేకపోవటమే అదృష్టం
వరల్డ్ అగ్లీయస్ట్ డాగ్ కు లక్ష రూపాయలు ప్రైజ్ మనీ

ముఖం నిండా అర్ధం పర్ధం లేకుండా పిచ్చి పిచ్చి వెంట్రుకలు, బయటకు వచ్చి ఒక వైపు వాలిపోయిన నాలుక, అనారోగ్యంతో వంగి చచ్చు పడిపోయిన వెనుక కాళ్లు. ఈ రకంగా మీరు ఒక కుక్కని చూస్తే ఏం చేస్తారు మరోసారి దానివైపు చూడకుండా, అసహ్యించుకుంటూ వెళ్ళిపోతారు. కాస్త ఎక్కువ సేపు దాన్ని చూస్తే, అది మళ్లీ ఎప్పుడైనా కలలో కనబడుతుంది ఏమో అని రెండోసారి కూడా చూడరు. అలాంటి ఓ కుక్క ఓ అవార్డు పొందింది. అందంగా లేకపోవడమే దానికి వరంగా మారి లక్ష రూపాయల ప్రైజ్ మనీ, ఒక ట్రోఫీ తీసుకువచ్చింది.

ఇప్పటివరకు మనకి అందంగా ఉన్న కుక్కల పోటీలు, యజమానితో వినయంగా ప్రవర్తించే కుక్కల పోటీలు, ఏవైనా అద్భుతమైన విన్యాసాలు చేసే కుక్కల పోటీలు చూసాం. కానీ అంద విహీనమైన కుక్కల పోటీలు ఉంటాయని మనకి పెద్దగా తెలియదు. కానీ గత 50 ఏళ్లుగా కాలిఫోర్నియాలో వరల్డ్ అగ్లీయస్ట్ డాగ్ అనే పోటీలను నిర్వహిస్తున్నారు. అందం లేకపోయినా ఈ కుక్కలు తన వైకల్యాన్ని అధిగమించి సంతోషంగా జీవిస్తున్నాయని చెప్పడమే నిర్వాహకుల లక్ష్యం. అంతేకాదు ఇలాంటి కాంపిటీషన్లో వల్ల అందవికారమైన కుక్కలను కూడా ఎవరో ఒకరు ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు ఈ విధంగా వాటి జీవితంలో ప్రేమని, ఆనందాన్ని నింపటమే ఈ కాంపిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2023 వరల్డ్ అగ్లీయస్ట్ డాగ్ పోటీలలో గెలిచిన ఈ కుక్క పేరు స్కూటర్. దీని వయసు 7 ఏళ్ళు. చైనీస్ క్రెస్టెడ్ బ్రీడ్ కు చెందినది. పుట్టుకతోనే వికారంగా జన్మించింది. దాంతో ఎవరూ దత్తత తీసుకోకపోవడంతో పుట్టినప్పటి నుంచి రెస్క్యూ గ్రూప్ కి చెందిన ఒక వ్యక్తి దీని ఆలనా పాలనా చూసుకున్నాడు. ఏడు సంవత్సరాల పాటు ఏ లోటూ లేకుండా పెంచాడు. అయితే ఒకానొక సమయంలో స్కూటర్ ఆరోగ్యాన్ని సంరక్షించడం దత్తత తీసుకున్న వ్యక్తికి ఆర్థికంగా భారమైంది. దీంతో స్కూటర్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే లిండానే దీనిని దత్తత తీసుకుంది. లిండా కూడా డాగ్ లవరే. అందుకే స్కూటర్ ను అప్పుడప్పుడు చూడటానికి వచ్చేది. ఆరోగ్యం, నడక విషయాలను తెలుసుకొనేది. ఇక మొత్తంగా స్కూటర్ బాధ్యత తానే తీసుకున్న లిండా అప్పటినుంచి మరింత ప్రేమతో చూసుకుంది. స్కూటర్ నడవలేక పోవడాన్ని చూసి లిండా చాలా బాధపడేది. ఫిజియో థెరపిస్టులను అప్రోచ్ అయ్యింది. వారి సలహా మేరకు దీనికి వెనుక కాళ్ళ సపోర్ట్ కోసం ఒక కార్ట్ తయారు చేయించి పెట్టింది. ఇప్పుడు ఆ కార్ట్ సహాయంతో స్కూటర్ స్వయంగా బయటకు కూడా వెళుతోందని ముచ్చటగా చెబుతోంది లిండా. ప్రేమకు, అందానికి సంబంధం లేదన్న విషయాన్ని ప్రపంచానికి మరోసారి రుజువు చేసింది.

Tags

Next Story