Donald Trump: పుతిన్‌తో మీటింగ్ రద్దు , రష్యాపై భారీ ఆంక్షలు..

ఉక్రెయిన్‌తో శాంతి చర్చల విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిజాయతీగా, నిక్కచ్చిగా వ్యవహరించడం లేదని నిర్ధారణకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు సంస్థలపై భారీ ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. పుతిన్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసుకున్న మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
అమెరికా ట్రెజరీ విభాగం ఈ ఆంక్షల వివరాలను అధికారికంగా వెల్లడించింది. రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్, లుకాయిల్ అనే రెండు ప్రధాన చమురు కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. "అర్థం లేని ఈ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ నిరాకరిస్తున్నందున, క్రెమ్లిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూరుస్తున్న ఈ రెండు కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నాం" అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.
కొద్ది నెలలుగా రష్యాపై కొత్త ఆంక్షలు విధించకుండా సంయమనం పాటిస్తున్న ట్రంప్, పుతిన్‌ను శాంతి చర్చలకు ఒప్పించవచ్చని భావించారు. అయితే, గత గురువారం పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆరు రోజులకే ఆయన సహనం నశించినట్లు కనిపిస్తోంది. "మేము ఆశించినట్లుగా పుతిన్ చర్చల విషయంలో నిజాయతీగా ముందుకు రాలేదు. అందుకే అధ్యక్షుడు తీవ్ర నిరాశకు గురయ్యారు" అని బెస్సెంట్ ఫాక్స్ బిజినెస్‌తో అన్నారు. చర్చల్లో పురోగతి లేకపోవడంతోనే బుడాపెస్ట్‌లో జరగాల్సిన సమావేశాన్ని కూడా రద్దు చేశారని తెలిపారు.
మరోవైపు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా రష్యాపై కొత్త ఆంక్షలను ప్రకటించింది. 2027 నాటికి రష్యా నుంచి ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జీ) దిగుమతిపై నిషేధం, మాస్కో ఉపయోగించే ఆయిల్ ట్యాంకర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం, రష్యా దౌత్యవేత్తలపై ప్రయాణ ఆంక్షలు వంటివి ఇందులో ఉన్నాయి. అమెరికా, ఈయూల తాజా నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఒక శాతానికి పైగా పెరిగాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com