Mexico Protests: మెక్సికోలో జెన్-జెడ్ తిరుగుబాటు!

Mexico   Protests: మెక్సికోలో జెన్-జెడ్ తిరుగుబాటు!
X
ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా యువత ఉద్యమం

జనరల్-జెడ్.. నేపాల్‌ను అతలాకుతలం చేసిన పేరు. ఇప్పుడు ఈ జనరల్ జెడ్ మెక్సికో వరకు పాకింది. ఇప్పుడు మెక్సికోలో జనరల్-జెడ్ తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. దేశంలో పెరుగుతున్న నేరాల రేట్లు, అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇవ్వడానికి మెక్సికో అంతటా వేలాది మంది ప్రజలు గుమిగూడారు. శనివారం దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు నిరసన తెలిపారు. ఈ నిరసన మార్చ్‌లో వివిధ వయసుల వారు పాల్గొన్నారు, వీరిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వృద్ధ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇటీవల హత్యకు గురైన మిచోకాన్ మేయర్ కార్లోస్ మాంజో మరణంపై దేశంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజా నిరసనలో మాంజో మద్దతుదారులు కూడా పాల్గొన్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ నివసించే మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్ చుట్టూ నిరసనకారులు బారికేడ్లను ఛేదించడంతో పోలీసులు మోహరించారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారుల సమూహం దాడిలో 100 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని, వారిలో 40 మంది ఆసుపత్రి పాలయ్యారని మెక్సికో నగర ప్రజా భద్రతా కార్యదర్శి పాబ్లో వాజ్క్వెజ్ ఒక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 మంది పౌరులు కూడా గాయపడ్డారని చెప్పారు. అలాగే ఈ నిరసనలకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశారని, మరో 20 మందిని పరిపాలనా నేరాలకు రిఫర్ చేశారని చెప్పారు.

అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మాదకద్రవ్యాల ముఠాలతో కుమ్మక్కయ్యారని జెన్-జి ఆరోపిస్తున్నారు. క్లాడియా షీన్‌బామ్ అమెరికా విధానాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో, వెనిజులాకు మద్దతు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు. అధ్యక్షుడు ట్రంప్‌పై బహిరంగ విమర్శలతో ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు జెన్-జి భారీ నిరసనలు అధ్యక్షురాలు క్లాడియా ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. అలాగే అక్టోబర్ 2024 నుంచి అధికారంలో ఉన్న షీన్‌బామ్ తన మొదటి సంవత్సరంలో 70 శాతానికి పైగా ప్రజాదరణను పొందారు. అయితే నవంబర్ 1న తన నగరంలో మాదకద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహిస్తూ కాల్చి చంపబడిన మిచోకాన్‌లోని ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజోతో సహా అనేక ఉన్నత స్థాయి హత్యల తర్వాత ఆమె భద్రతా విధానాలు విమర్శలకు గురయ్యాయి. తాజాగా ఘటనపై మెక్సికన్ వార్తా సంస్థ ఎల్ యూనివర్సల్ నివేదికల ప్రకారం.. నిరసనకారులు నేషనల్ ప్యాలెస్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తుండగా భద్రతా దళాలు భాష్ప వాయువును ప్రయోగించి, రాళ్ళు విసిరాయి. “జోకాలోలో ప్రదర్శన చేస్తున్న యువకులపై వారి కవచాలు, రాళ్లతో వారు (భద్రతా దళాలు) దాడి చేశారని వెల్లడించింది.

Next Story