12 Nov 2020 7:14 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / అమెరికా ప్రతినిధుల...

అమెరికా ప్రతినిధుల సభలో విరిసిన పద్మం.. తెలుగువారికెంతో గర్వకారణం

తెలుగింటి ఆడపడుచు తాజా ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.. తెలుగువారందరూ ఆమె గురించి మరోసారి మాట్లాడుకునేలా చేశారు.

అమెరికా ప్రతినిధుల సభలో విరిసిన పద్మం.. తెలుగువారికెంతో గర్వకారణం
X

నాతోపాటు నలుగురూ బాగుండాలి.. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి.. సమాజంతో సత్ససంబంధాలు కలిగి ఉండాలి.. నాయకులుగా ఎదిగేందుకు ఇవి అవసరమని నిరూపించారు పద్మ కుప్పా. అమెరికాలోని మిషిగన్ 41వ జిల్లా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించారు. ఎక్కడికి వెళ్లినా ఎక్కడినుంచి వచ్చామన్నది మరిచి పోని మన తెలుగింటి ఆడపడుచు తాజా ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.. తెలుగువారందరూ ఆమె గురించి మరోసారి మాట్లాడుకునేలా చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మిషిగన్ 41వ జిల్లా స్థానం నుంచి డెమొక్రాట్ పార్టీ తరపున రెండోసారి ఎన్నికయ్యారు పద్మ. మిషిగన్ రిపబ్లికన్ల కంచుకోట. అయిన అక్కడ మరోసారి విజయబావుటా ఎగురవేయడం ఆమెకే సొంతమైంది.

పద్మ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని తనాలి. తండ్రి ఉద్యోగ రిత్యా మధ్య ప్రదేశ్ లోని బిలాయ్ లో స్థిరపడగా అక్కడే పద్మ పుట్టారు. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తండ్రి శ్రీనివాస శాస్త్రి ఉన్నత చదువుల నిమిత్తం కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు. మధ్యతరగతి కుటుంబమైనా చదువులో ప్రోత్సాహం మెండుగా ఉండేది.. తండ్రితో పాటు తల్లి ఉష కూడా అమెరికాలో జీవశాస్త్రంలో పీహెచ్ డీ చేశారు.

పదవతరగతి వరకు అమెరికాలో చదువుకున్న పద్య హైదరాబాద్ లోని స్టాన్లీ గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్, వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ లో చదివిన మొదటి విద్యార్ధిని పద్మ కావడం విశేషం. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు తిరిగి వెళ్లి వివిధ ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశారు. సుధాకర్ తాడేపల్లితో వివాహం అయ్యాక మిషిగన్ లో స్థిరపడ్డారు.

ఒకవైపు వృత్తి బాధ్యతలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ఆ ప్రాంతంలో పద్మ చేసిన సామాజిక సేవ ప్రజల దృష్టిని ఆకర్షించింది. విద్యారంగం అభివృద్ధి కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఇలా పలు అంశాలపై తన గళం వినిపించారు. 2008లో ఒబామా ఎన్నికల్లో నిలబడినప్పుడు కూతురు శ్రీకరితో కలిసి ప్రచారంలో పాల్గొంది. ఆ సమయంలో పరిష్కరించాల్సిన అనేక సమస్యలు తన కళ్ల ముందు కనిపించాయి.

అదే సమయంలో రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్న కొందరు ఆసియన్ అమెరికన్ మహళలతో పరిచయం అయింది. వాళ్ల సూచన మేరకు మిషిగన్ లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. డెమొక్రాట్ల తరపున అభ్యర్ధిగా నిలబడాలనే నిర్ణయం తీసుకున్నారు.. ఎన్నికలకు పది నెలల ముందే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి రోజుకి 50 ఇళ్లను సందర్శించేవారు.. స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మాట ఇచ్చి గెలుపొందారు.

మతమౌఢ్యం, జాతి వివక్ష ఏ రూపంలో ఉన్నా దానిని నేను వ్యతిరేకిస్తాను అని పద్మ చెబుతారు. సుదీర్ఘకాలం నుంచి మిషిగన్ లో ఉంటున్న వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయగలిగే పనులపై దృష్టి కేంద్రీకరిస్తానని ఆమె అంటున్నారు. పిల్లలందరికి నాణ్యమైన విద్య,అందరికీ అందుబాటులో వైద్యం, పర్యావరణ పరిరక్షణ ఇవే నా ప్రాధాన్యాలు అని పద్మ స్ఫష్టం చేస్తున్నారు.

Next Story