అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి.. ఇండియాలో విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి పర్యటన

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి.. ఇండియాలో  విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి పర్యటన

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు మరో కొన్ని రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. డెమొక్రటిక్ నేత జో బైడెన్, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత్ పై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై జో బైడెన్ చాలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిత్రులతో మాట్లాడాల్సిన పద్ధతి అదికాదని సలహా ఇచ్చారు. 'అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ దేశాన్ని మురికిగా పిలిచారని...మన స్నేహితుల గురించి మాట్లాడే తీరు ఇది కాదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా అమెరికా విదేశాంగ విధానాన్ని తిరిగి గౌరవప్రద స్థానంలో ఉంచుతామని జో బైడెన్‌ స్పష్టంచేశారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి దేశంలో ఉచితంగా కరోనా వ్యక్సిన్ అందిస్తామని హామీ కూడా ఇచ్చారు.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి జోరుగా ఉన్న సమయంలో ఆదేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ లు మనదేశంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ సంబంధింత ఒప్పందాలు. ద్వైపాక్షికచర్చలు నిర్వహించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయ ఓటర్ల సంఖ్యకూడా ఎక్కువగా ఉండటం.. ఆదేశ మంత్రులు ఎన్నికల సమయంలో మనదేశంలో పర్యటించడం ఎన్నారైల ఓటింగ్ పై ప్రభావం చూపుతుందని విశ్లేషకుల భావిస్తున్నారు. అయితే అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నారైల ఓట్లు గెలుపును శాసించే స్థాయిలో ఉన్నాయనడంలో సందేహం లేదు.

అయితే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ తరుపున మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తమ ప్రచారాన్ని ముమ్మరంచేశారు. దీనిలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌పై బరాక్‌ ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. కేవలం వ్యక్తిగత లాభం, ఆయన సంపన్న మిత్రుల కోసమే ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నారని ఆరోపించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలోనూ ట్రంప్‌ ప్రణాళిక బద్దంగా వ్యవహరించలేదని మండిపడ్డారు.దాంతో దేశంలో తీవ్రనష్టం జరిగిందన్నారు.

ఇదిలా ఉండగా అమెరికాలో ఉండే ముందస్తు ఓటింగ్ ఈసారి గణనీయంగా పెరిగింది. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న కారణంగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటువేసేందుకు అమెరికన్లు భయపడుతున్నారు. ఈనేపథ్యంలో వారు బ్యాలెట్, ఈమెయిల్ ద్వారా ముందస్తు ఓటింగ్ వేస్తున్నారు. గతంలో ఎన్నడు లేనంతగా రికార్డుస్థాయిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అమెరికాలో మొత్తం 17 కోట్లమంది ఓటర్లు ఉండగా.. అందులో 5కోట్ల 90 లక్షల మంది ఎర్లీ ఓటింగ్‌లో ఓట్లువేశారు. టెక్సాస్ రాష్ట్రంలో అత్యధిక ముందస్తు ఓటింగ్ శాతం నమోదైంది. అయితే ముందుస్తు ఓటింగ్ డెమొక్రటిక్ అభ్యర్ధికి అనుకూలంగా పడుతున్నట్లు భావిస్తున్నా... ట్రంప్ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story