Iraq : ఇరాక్‌లో బాలికల కనీస వివాహ వయసు 9కి తగ్గింపు

దేశంలో యువతల వివాహ కనీస వయస్సు 9 ఏళ్లుగా నిర్ణయించేందుకు ఇరాక్ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తుంది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా.. ఇరాక్ మాత్రం ఎక్కడా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఈ బిల్లును పార్లమెంట్‌లో న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో దీనిని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అమ్మాయి వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. ఈ బిల్లు పాస్ అయితే మాత్రం అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించబడుతుంది.
బాలికలు తొమ్మిదేళ్ల వయసులో నాలుగో తరగతి చదువుతుంటారు. లోకం గురించి అప్పుడప్పుడే అవగాహనకు వస్తుంటారు. వారికి ఆ వయసులో పెళ్లి చేస్తే? ఆ వయసులో బాలికలను సంసార సాగరంలోకి తోసేస్తే? బాలికలకు పెళ్లి చేసేందుకు వారి తల్లిదండ్రులకు ఇలాంటి అవకాశమే కల్పించాలని ఇరాక్ ప్రభుత్వం భావిస్తోంది. బాలికల వివాహానికి చట్టబద్ధమైన వయస్సును తొమ్మిదేళ్లకు తగ్గించాలని ఇరాక్ పార్లమెంటులో న్యాయ మంత్రిత్వ శాఖ బిల్లు ప్రవేశపెట్టడంతో దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా ఇరాక్‌లో పర్సనల్ స్టేటస్ లాను సవరించాలనుకుంటున్నారు. ఆ దేశంలో వివాహం చేసుకోవడానికి కనీస వయస్సు 18గా ఉంది.
తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోద ముద్ర పడి బాలికలు తొమ్మిదేళ్లకే పెళ్లి చేసుకోవచ్చు. అలాగే, బాలురు 15 ఏళ్లకు వివాహమాడి కాపురాన్ని మొదలుపెట్టవచ్చు. ఇప్పటికే బాల్యవివాహాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచమంతా అన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకుంటూ బాల్య వివాహాలు, లింగ వివక్షవంటి దురాచారాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
ఇటువంటి సమయంలో ఇరాక్ ప్రవేశపెట్టిన బిల్లుపై మానవ హక్కుల సంఘాలతో పాటు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అమ్మాయిల విద్య, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నాయి. బాలికలు చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితులు మరింత పెరుగుతాయని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
అమ్మాయిలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వంటివి పెరుగుతాయని, గృహహింసకు అడ్డూఅదుపు లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇరాక్‌లో ఇప్పటికే దాదాపు 28 శాతం మంది బాలికలను పెద్దలు 18 ఏళ్లలోపే వివాహ బంధంలోకి తోసేస్తున్నాని యూనిసెఫ్ గణాంకాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com