Iran: ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్

Iran: ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్
పశ్చిమాసియాలో హై టెన్షన్

అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగానే ఇజ్రాయెల్‌పై హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే, హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. మరోవైపు ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఇరాన్ వ్యూహాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఉంది.

ఇదిలా ఉంటే ఇరాన్ కాలు దువ్వితే.. ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇరాన్ చర్యలను వైట్‌హౌస్ ముందే కనిపెట్టింది. ఇరాన్ క్షిపణి దాడులు చేయొచ్చని హెచ్చరించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని కూడా వైట్‌హౌస్ స్పష్టం చేసింది.

హిజ్బు్ల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత ఇరాన్ పగతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. అన్నట్టుగానే మంగళవారం ఇజ్రాయెల్‌పై దాడులు మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ సైన్యం కూడా లెబనాన్ రాజధాని బీరుట్‌లో కూడా మంగళవారం భీకర దాడులు చేస్తూనే ఉంది. అంతేకాకుండా లెబనాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా సంభవించిన నష్టంపై ఎలాంటి సమాచారం లేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. ఈ దాడి తీవ్రమైనదిగా పరిగణిస్తున్నామని, పర్యవసానాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించాలని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్టు అంతార్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఖమేనీ ఒక సురక్షిత ప్రదేశంలో ఉన్నారని సీనియర్ అధికారి ఒక పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా సాయం చేయాలని అమెరికా మిలిటరీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.

ఇక ఇరాన్ క్షిపణి దాడులకు దిగక ముందే సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులను ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. బాంబు షెల్టర్లకు దగ్గరగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు పౌరుల ఫోన్లకే నేరుగా సందేశాలు పంపించింది. జాతీయ టీవీలో ప్రకటన కడా చేసింది. కొన్ని ప్రాంతాల్లో సైరన్‌లను మోగించారు. ఈ తాజా పరిణామంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

Tags

Next Story