Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస.. హసీనా ప్రసంగమే కారణం?

గ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీలీగ్ పార్టీ నేతల ఆస్తులపై ఆందోళనకారుల దాడులు, గృహ దహనాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దాదాపు 24 జిల్లాల్లో ‘బంగబంధు’ ముజిబుర్ రెహమాన్ కుడ్యచిత్రాలను తొలగించారు. భారత్‌లో ఆశ్రయం పొందిన షేక్ హసీనా బుధవారం రాత్రి పార్టీ నేతలను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన ప్రసంగంతో మొదలైన విధ్వంసం మూడో రోజుకూ చల్లారలేదు. శుక్రవారం తెల్లవారుజామున ఢాకాలోని బనానీ ప్రాంతంలో గల అవామీలీగ్ అధ్యక్ష మండలి సభ్యుడు షేక్ సలీం ఇంటిని తగలబెట్టారు. పలుచోట్ల ఇళ్లు దోచుకొని, ఆ తర్వాత నిప్పు పెడుతున్నారు.
విధ్వంసం ఆపాలని, చట్టాన్ని గౌరవించి దేశంలో శాంతిని పునరుద్ధరించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం శుక్రవారం ఆందోళనకారులను కోరింది. ‘‘జరుగుతున్న దాడులను తీవ్రమైన ఆందోళనతో గమనిస్తున్నాం. ఇటువంటి చర్యలను గట్టిగా ప్రతిఘటిస్తాం. అవామీలీగ్ నేతల ఆస్తులపై దాడులు ఆపండి. రెచ్చగొట్టే చర్యలతో దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం’’ అని యూనస్ సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత సవాళ్లను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొనపోతే దేశ సుస్థిరత ప్రమాదంలో పడి, నిరంకుశ శక్తులు మళ్లీ పుంజుకొంటాయని హేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ ప్రధాని ఖలేదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు అక్రమ వలసదారులను వెనక్కు పంపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగా భారత్ కూడా అక్రమంగా ఇక్కడ ఉంటున్న బంగ్లాదేశీలను, రోహింగ్యాలను వెనక్కుపంపాలని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు జమ్మూలో శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com