Chandrayaan-3: బ్రిక్స్ సదస్సులో మోదీ మెరుపులు..
ఆగస్టు 23, 2023 గురువారం భారత దేశం చరిత్ర సృష్టించింది. దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరించింది. దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్ గా ఈ అద్భుత క్షణాలను వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా అమితానందం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక క్షణాలు వీక్షించడంతో జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు తాను దక్షిణాఫ్రికాలోఉన్నా కానీ ఇతర భారతీయుల లాగే తన మనసంతా చంద్రయాన్ -3పై ఉందన్నారు. మొత్తం బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వ్యక్తిగతంగా కలిసేందుకు త్వరలో అక్కడకు వస్తానని చెప్పారు.
అయితే సరిగ్గా అదే సమయంలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. భారతీయులతో మాట్లాడి, తరువాత ఇస్రో ఛైర్మన్ తో ఫోన్లో సంభాషించిన తరువాతే మోదీ విందుకు హాజరు అయ్యారు. అయితే ఈ విందులో ప్రధాని మోదీ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన సందర్భంగా ప్రపంచదేశాలకు చెందిన నేతలు ప్రధాని మోదీని అభినందించారు. చాలా మంది నేతలు ప్రధాని మోదీని కలుసుకుని మిషన్ విజయవంతమైనందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఇందులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా పాల్గొన్నారు.
మిషన్ విజయవంతం కావడంపై దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయసంతతికి చెందినవారు ప్రధాన మంత్రి మోదీ ని ప్రశంసించారు. జోహన్నెస్‌బర్గ్‌లో కూడా చంద్రయాన్-3 విజయవంతమైన ఉత్సాహాన్ని సెలబ్రెట్ చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. జోహన్నెస్‌బర్గ్ లోని ఓ హోటల్‌లో భారతీయ సంతతికి చెందిన వారిని కలిసిన ఫొటోలను కూడా ప్రధాని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ.. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని కొనియాడారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగు పెట్టడం గొప్ప విషయమని, అంతరిక్ష రహస్యాల అన్వేషణలో ఇదొక అతి పెద్ద ముందడుగని ప్రశంసించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని అన్నారు. తన మిత్రుడు ప్రధాని మోదీకి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నాయకత్వంకి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com