Modi In Lakshadweep: మోదీపై కామెంట్స్.. ముగ్గురు మాల్దీవుల మంత్రులు సస్పెషన్

కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో కలకలం సృష్టిస్తోంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రి చేసిన ట్వీట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఈ వివాదం నెలకొన్న వేళ మాల్దీవుల ప్రభుత్వ వెబ్‌సైట్లు అన్ని డౌన్ అయ్యాయి. భారత్ నుంచి ఎదురైన వ్యతిరేకతతో మాల్దీవులు ప్రభుత్వం.. చర్యలు చేపట్టింది. ముగ్గురు మంత్రులను వారి పదవుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
36 ద్వీపాల సమాహారమైన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవుల్లో గుబులురేపుతోంది. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ అక్కడ సముద్ర తీరంలో విహరించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. అంతేకాదు స్నార్కెలింగ్ అనే సాహస స్మిమ్మింగ్ చేసి సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో లక్షదీవులు మంత్రముగ్ధులను చేస్తున్నాయని పోస్ట్ చేశారు. మోదీ లక్షద్వీప్ పర్యటనతో భారత్‌లో గూగుల్‌లో అత్యధిక మంది శోధించిన పదంగా లక్షద్వీప్ టాప్-10లో నిలిచింది. దేశీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మోదీ లక్షద్వీప్ పర్యటన ఉంటే దీన్ని ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రి చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వివాదానికి కారణమైంది. మాల్దీవులను భారత్ లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించిన ఆ దేశ మంత్రి...బీచ్ టూరిజంలో తమతో పోటీపడటంలో భారత్ సవాళ్లు ఎదుర్కొంటోందని అన్నారు. దీంతో ఒక్కసారిగా భారత్‌లో నెటిజన్లు మాల్దీవుల మంత్రిపై మండిపడ్డారు. మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక గమస్థానం లక్షద్వీప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
పర్యాటకంగా ద్వారా మాల్దీవులు ఎంతో ఆర్జిస్తోంది. ఆ దేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల్లో భారతీయులదే అగ్రస్థానం. ఏడాదికి 2 లక్షల మందికిపైగా భారతీయులు మాల్దీవులను సందర్శిస్తున్నారు. మాల్దీవులు అన్ని రకాలుగా భారత్‌పై ఆధారపడుతుంది. మాల్దీవులకు చెందిన వేలాదిమంది ప్రజలు భారత్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. 1988లో శ్రీలంకకు చెందిన కొందరు ఉగ్రవాదులు మాల్దీవులపై దాడి చేయగా భారత వాయుసేన వారిని తరిమికొట్టి అప్పటి దేశాధ్యక్షుడిని రక్షించింది. ఐతే మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొంది పగ్గాలు చేపట్టడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే మోదీ లక్షద్వీప్ పర్యటనను ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. మాల్దీవుల తరహాలో లక్షద్వీప్‌ను అభివృద్ధి చేయాలని మోదీ సర్కారు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది. ఇందుకోసం వెయ్యి 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. మాల్దీవులకు ఉత్తర దిశగా లక్షద్వీప్ ఉంటుంది. భారత ప్రధాన భూభాగం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంది. మరోవైపు భారత్‌తో వివాదం వేళ మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన అన్ని వెబ్‌సైట్లు సాంకేతిక లోపం తలెత్తి డౌన్ అయ్యాయి. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయిజ్జు చైనా పర్యటనకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com