Modi-Putin: ఒకే కారులో మోదీ, పుతిన్..

చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉన్న బలమైన స్నేహబంధం మరోసారి స్పష్టంగా కనిపించింది. సదస్సు కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం కోసం ఒకే కారులో కలిసి ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి, వారి వ్యక్తిగత సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలిచింది.
సోమవారం ఎస్‌సీఓ సదస్సు ముగిశాక, భారత్-రష్యా సంబంధాల బలోపేతం, ఉక్రెయిన్ సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు మోదీ, పుతిన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశ వేదికకు ఇద్దరూ ఒకే వాహనంలో వెళ్లారు. దీనిపై ప్రధాని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, "ఎస్‌సీఓ సదస్సు ముగిశాక, నేను, అధ్యక్షుడు పుతిన్ కలిసి మా ద్వైపాక్షిక సమావేశ వేదికకు ప్రయాణించాం. ఆయనతో సంభాషణలు ఎల్లప్పుడూ ఎంతో విలువైనవి" అని పేర్కొన్నారు.
ఇక, సదస్సులో పాల్గొన్న నేతలంతా గ్రూప్ ఫొటో కోసం వెళ్తున్నప్పుడు మరో సంఘటన జరిగింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ లోతైన సంభాషణలో మునిగిపోయి నడుచుకుంటూ వెళ్తుండగా, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వారి పక్కనే ఒంటరిగా నిలబడి ఉండటం కెమెరాలకు చిక్కింది. ఇద్దరు ప్రపంచ నేతలు మాట్లాడుకుంటూ తనను దాటి వెళ్తున్నప్పుడు షెహబాజ్ ఏకాకిలా కనిపించిన ఈ దృశ్యం అంతర్జాతీయ వేదికపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com