అమెరికాలో మోదీజీ థాలి

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటనపై స్థానిక భారతీయులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. న్యూజెర్సీలోని ఓ భారతీయ రెస్టారెంట్ మోదీజీ థాలి.. పేరుతో ప్రత్యేకంగా వంటకాన్ని తయారు చేసింది. మోదీ పర్యటన నేపథ్యంలో స్థానిక భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఇష్టపడేలా ఒక వెజిటేరియన్ మీల్ ను డిజైన్ చేశారు రెస్టారెంట్ ఓనర్ శ్రీపాద కులకర్ణి. నోరూరించే వంటకాలతో కూడిన ఈ థాలిలో ఖిచ్డీ, రసగుల్లా, సర్సోం కా సాగ్, కాశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చీజ్, పాపడ్ మొదలైనవి ఉంటాయి. ఇప్పటికే చాలా మంది స్పెషల్ థాలీని టేస్ట్ చేశారని, స్థానికుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉందని ఆయన చెబుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా భాగస్వామ్యంతో జనరల్ ఎలక్ట్రిక్ జెట్ ఇంజిన్లు తయారీతో పాటు అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.
గతంలో 2021లో మోదీ క్వాడ్ సమ్మిట్‌లో భాగంగా అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పర్యటన ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ పర్యటనద్వారా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన భారతీయ ప్రధానిగా మోదీ నిలవనున్నారు. అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. మోదీ పర్యటనతో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. పర్యటన సందరర్భంగా జూన్ 22వ తేదీన వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరు కావాలంటూ అధ్యక్షులు జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం అందింది. ప్రధాని రాకకు రెండు రోజుల ముందు అనగా జూన్ 18వ తేదీన 20 ప్రధాన నగరాల్లో భారత ఐక్యతా దినోత్సవం మార్చ్‌లు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

