ప్రధాని మోడీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం

రెండు రోజుల ఈజిప్టు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు నివాళులు ఆర్పించారు. కైరోలోని హెలియోపొలిస్ కామన్ వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో స్మారకాన్ని సందర్శించిన మోదీ అక్కడ పుష్పాలు సమర్పించి అమరులైన భారత జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం అక్కడ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. కైరోలో అతి పురాతన అల్ హకీమ్ మసీదునూ మోదీ సందర్శించారు. భారత్ కు చెందిన దావూదీ బోహ్రా సంఘం సహాయంతో ఈ మసీదును పునరుద్ధరించారు. తర్వాత కైరోలో ఈజిప్టు అధ్యక్ష భవనానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ -సిసి స్వాగతం పలికారు. ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద నైలు అవార్డును ప్రధాని మోదీకి ఎల్ -సిసి ప్రదానం చేశారు. ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ -సిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఆహ్వానం మేరకే మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. ఈజిప్టుతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com