Mojtaba Khamenei: క్షిపణి దాడి నుంచి తృటిలో బయటపడిన మొజ్తబా ఖమేనీ.. కానీ

Mojtaba Khamenei: క్షిపణి దాడి నుంచి తృటిలో బయటపడిన మొజ్తబా ఖమేనీ.. కానీ
X
మాస్కోలో చికిత్స !.. ఖ‌ర్గ్ దీవికి అమెరికా సైనిక బ‌ల‌గాలు

అమెరికా–ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై కొనసాగిస్తున్న దాడుల్లో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల టెహ్రాన్‌పై జరిగిన భారీ వైమానిక దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ మాత్రం తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.

క్షణాల వ్యవధిలో తప్పిన ప్రమాదం

ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో జరిగిన క్షిపణి దాడి సమయంలో మొజ్తబా ఖమేనీ భవనంలో లేకపోవడంతో ఆయన ప్రాణాలు దక్కినట్లు సమాచారం. దాడి జరగడానికి కొద్దిసేపటి ముందే ఆయన ఆ భవనం బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్ది క్షణాలకే ఆ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు దాడి చేసినట్లు విదేశీ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

భారీ విధ్వంసం

దాడిలో ఒక క్షిపణి అలీ ఖమేనీ ఉన్న భవనాన్ని తాకగా, మరొకటి పై అంతస్తులో ఉన్న మొజ్తబా నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ దాడిలో ఇరాన్ సైనిక అధికారి మొహమ్మద్ షిరాజీ సహా పలువురు మరణించినట్లు సమాచారం. ఘటన తీవ్రతకు అక్కడి భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆడియో లీక్‌ల ద్వారా తెలిసిందని విదేశీ మీడియా తెలిపింది.

గాయాలపై ఊహాగానాలు

దాడి సమయంలో మొజ్తబా ఖమేనీకి కూడా గాయాలైనట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని, ఒక కాలు తొలగించాల్సి వచ్చిందని కూడా కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ అంశాలపై ఇరాన్ ప్రభుత్వం నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు.

మాస్కోలో చికిత్స?

మోజ్తబా ఖమేనీ చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు తరలించారని కువైట్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించలేదు. ఇలాంటి వార్తలపై తాము సాధారణంగా వ్యాఖ్యానించమని మాత్రమే తెలిపారు. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్ కూడా ఇటీవల జరిగిన దాడిలో మొజ్తబాకు గాయాలైనట్లు పేర్కొన్నారు.

ఖర్గ్ దీవిపై అమెరికా దృష్టి

ఇక యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇప్పటికే వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ ద్వీపం ద్వారానే జరుగుతుంది. అమెరికా అక్కడ సైనిక బలగాలను మోహరించే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు కొనసాగితే గల్ప్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story