BUDDHIST: ప్రేమ వలపులో రూ.102 కోట్లు సమర్పించిన సన్యాసులు

థాయ్‌లాండ్‌లో వెలుగులోకి వచ్చిన 'మిస్ గోల్ఫ్' పేరుతో గుర్తింపు పొందిన ఓ యువతి – తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులను బెదిరించి రూ.102 కోట్లు వసూలు చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా , అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సంఘటన బౌద్ధ ధర్మ వ్యవస్థలో ఉన్న లోపాలను, సన్యాసుల వ్యక్తిగత బాధ్యతను, మరియు ఆధునిక సోషల్ మీడియా ప్రభావాన్ని ప్రశ్నించేలా చేసింది.
ఆమె వ్యక్తిగతంగా సన్యాసులకుపంపిన ప్రలోభాల వీడియోలు, ఫోటోల ఆధారంగా వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేసిన తీరును పోలీసులు విచారణలో వెల్లడించారు. జూన్‌లో ఓ సన్యాసి తన స్థానం నుండి వైదొలగడం, ఆ తర్వాత పోలీసులకు చేరడం వల్ల ఈ వ్యవహారం బయటపడింది. బాధితుల నుంచి మహిళ మొత్తం 80 వేల మీడియా ఫైళ్లను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం నైతికంగా మాత్రమే కాక, న్యాయపరంగా పెద్ద తప్పు. ఆమెపై దోపిడీ, మనీలాండరింగ్ తదితర కేసులు నమోదయ్యాయి.
అయితే, ఈ క్రమంలో అసలు సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒక బౌద్ధ సన్యాసి – ధర్మానికి, ఉపాసనకు ప్రతీకగా ఉన్న వ్యక్తి – మామూలు ప్రలోభాలకు లోనవుతాడా? ఎందుకు? ధర్మపరమైన నియమాలు, శిక్షణలు, సామాజిక భయభ్రాంతులు ఇవన్నీ ఎక్కడ అటకెక్కాయి? సన్యాస ధర్మాన్ని అవలంబించినవారు జీవితాంతం వ్రతదీక్షతో ఉండాలని భావిస్తే, ఇలాంటి దుర్మార్గ సంఘటనలు సన్యాసం మీదే ప్రజలకు అనుమానాన్ని పెంచతాయి. థాయ్ బౌద్ధ పాలక సంస్థ అయిన సంఘ సుప్రీమ్ కౌన్సిల్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించడం, నిబంధనలపై పునరాలోచన మొదలుపెట్టడం మంచి పరిణామం. కానీ కేవలం కఠినమైన శిక్షలు లేదా నియమాలు ఈ సమస్యకు పరిష్కారం కావు. ఈ వ్యవస్థలో నిజమైన ధర్మ మార్గదర్శకత, సన్యాసుల వ్యక్తిత్వ వికాసానికి మద్దతు ఇవ్వడం ముఖ్యమైన బాధ్యత.ఇక్కడ మహిళ దురుద్దేశాన్ని తప్పక ఖండించాలి. కానీ, అసలు ప్రాతిపదిక సన్యాసుల వ్యక్తిగత స్థిరత్వం, ప్రలోభాలపై వారి ఆత్మ నియంత్రణపై ఉండాలి. ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం, మానవ సంబంధాల బలహీనతలు – ఇవన్నీ మతపరమైన నమ్మకాలను చెరిపివేసేంతటి సామర్థ్యం కలిగినవే.
ఈ కేసు ఓ హెచ్చరిక మాత్రమే కాదు, ఓ ప్రశ్నార్థకం. తపస్సు నిబంధనలతో కాదు, ఆత్మచింతనతో నిర్మితమవుతుంది. ఆత్మశుద్ధి లేని ధర్మబోధ. ధర్మ మార్గాన్ని చేపట్టే వారు, దాన్ని బలంగా నిలబెట్టే వ్యవస్థ – రెండూ సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో తలెత్తకుండా ఉండాలంటే... ధర్మానికి గౌరవం కలిగినంత, ధర్మాన్ని అనుసరించేవారికి భయభక్తులు కలిగేలా వ్యవస్థలు పనిచేయాలి. ధర్మాన్ని బలంగా నిలుపుకోవాల్సినవారే… మాయలో పడిపోతే, బౌద్ధ వ్యవస్థపై నమ్మకమే కదా కుంగిపోతుంది. వీడియోల బెదిరింపులకు తలొగ్గిన సన్యాసులు… తమ మౌనంతో మరో పెద్ద మోసానికి బలవుతుండటం బాధాకరం.ఈ సంఘటన ఒక వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ లోపాలను బయటపెడుతోంది. థాయ్ ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టినా… ఇలాంటి దొంగ ప్రేమల వలలు ఇంకెంత మంది బాధితుల్ని దోచుకున్నాయో ఎవరికీ తెలియదు. ధర్మపరులు తప్పితే… ధర్మానికే తలవంక వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com