MOROCCO : మొరాకోలో భూకంపం

MOROCCO :  మొరాకోలో భూకంపం
చరిత్రాత్మక నగరం మర్రాకేశ్‌కు 70 కి.మీ దూరంలో భూకంపం కేంద్రం

ఆఫ్రికా దేశమైన మొరాకోను తీవ్ర భూకంపం వణికించింది. శుక్రవారం రాత్రి 11 గంటల 11 నిమిషాలకు రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 19 నిమిషాల అనంతరం 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. అట్లాస్‌ పర్వతాల్లో ఉన్న గ్రామాల నుంచి చరిత్రాత్మక నగరం మర్రాకేశ్‌ వరకు భూకంపనలు విలయం సృష్టించింది. మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 70 కిలోమీటర్లు దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది.


భూ ప్రకంపనల కారణంగా ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్‌ హౌజ్‌, మర్రాకేశ్‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించాయి.. అకస్మాత్తుగా భూమి కంపించడంతో భవనాలు కదిలిపోవడం కనిపించింది. ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. మొబైల్‌, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌లు కూడా స్తంభించాయి. రహదారులు దెబ్బతిని అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు నిండిపోయాయి. మొరాకో ప్రజలు భూకంపం విలయానికి సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు కనిపిస్తున్నాయి. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశముందన్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపైనే ఉంటున్నారు.


మొరాకోలో ఇంతటి భారీ భూకంపాలు సంభవించడం చాలా అరుదు. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని చూడలేదని యునైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 1960లో మొరాకోలోని అగాదిర్ నగరం సమీపంలో 5.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించి వేలాది మంది మరణించారు.మొరాకోలో భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.



Tags

Read MoreRead Less
Next Story