Terrorist attack: రష్యాలో రెండు చర్చిలు, పోలీస్‌ పోస్ట్‌పై ఉగ్ర దాడి

ముస్లిం జనాభా అధికంగా డాగేస్తాన్‌లో ఉగ్రదాడులు

రష్యాలోని ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ డాగేస్తాన్‌’లో ఉగ్రవాదులు దాడులు జరిపారు. రెండు చర్చిలు, ఒక పోలీసు పోస్ట్‌లపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 15 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని డాగేస్తాన్‌ గవర్నర్‌ సెర్గీ మెలికోవ్‌ సోమవారం తెల్లవారుజామున ప్రకటించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఈ విడియోలో చర్చి, ప్రార్థనా మందిరం రెండూ మంటల్లో కాలిపోయినట్లు కనిపిస్తున్నాయి.

డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలోని చర్చి, ట్రాఫిక్ పోలీసు పోస్ట్‌పై దాడి చేశారు. డెర్బెంట్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరం, చర్చిపై సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపినట్లు డాగేస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రష్యా ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం... చర్చి, ప్రార్థనా మందిరం రెండూ మంటల్లో కాలిపోయాయి.

ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండే డాగేస్తాన్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, గతంలోనూ ఈ ప్రాంతానికి సాయుధ తిరుగుబాటు చరిత్ర ఉందని రష్యా ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. తీవ్రవాద దుశ్చర్యగా అభివర్ణించింది. సోమ, మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా రష్యా అధికారులు ప్రకటించారు. కాగా దాడులు జరిగిన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టినట్టు యాంటీ టెర్రరిస్ట్ కమిటీ అధికారులు వెల్లడించారు. కాగా దాడులలో ఎంతమంది తీవ్రవాదులు పాల్గొన్నారనేది స్పష్టంగా తెలియలేదని వివరించారు. మరోవైపు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. కాగా ఈ దాడుల్లో ప్రమేయం ఉందనే అనుమానంతో దగేస్తాన్‌కు చెందిన ఓ అధికారి కొడుకుని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు రష్యన్ అధికార వార్తా సంస్థ టీఏఎస్ఎస్ పేర్కొంది.

Tags

Next Story