Hajj Pilgrims: హజ్‌ యాత్రలో 550 మంది యాత్రికులు మృతి

యాత్రికులను అతలాకుతలం చేసిన ఉష్ణోగ్రతలు

సౌదీలో హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. యాత్రలో ఎండ వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందార‌ని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. ఇక చ‌నిపోయిన‌ వారిలో ఈజిప్ట్‌, జోర్డాన్‌ దేశస్తులు అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అలాగే 60 మంది జోర్డానియన్లు కూడా మ‌ర‌ణించార‌ని తెలిపారు. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు చ‌నిపోయిన వారి సంఖ్య 577కి చేరిన‌ట్లు తెలుస్తోంది.

మక్కా గ్రాండ్ మసీదులో సోమవారం ఉష్ణోగ్రత 51.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. గత నెలలో ప్రచురించబడిన సౌదీ అధ్యయనం ప్రకారం, వాతావరణ మార్పుల వల్ల హజ్ యాత్ర ఎక్కువగా ప్రభావితమవుతోంది. హజ్ యాత్రికులు పూజలు చేసే ప్రాంతంలో ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతోందని పేర్కొంది.

మక్కా సమీపంలో ఉన్న అల్-ముయిసెమ్‌లోని ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించాయి. తమ దేశం నుంచి వచ్చిన యాత్రికులు చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని ఈజిప్టు ప్రభుత్వ వర్గాలు హజ్‌ నిర్వహకులకు తెలియజేశాయి. వారిని గుర్తించేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి. చనిపోయిన వారిలో 60 మంది జోర్డాన్‌వాసులు కూడా ఉన్నారు. గత ఏడాది 240 మరణాలు నమోదయ్యాయి. వీరిలో చాలా మంది ఇండోనేషియాకు చెందినవారు.

ఎండ తాపాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహకులు అనేక ఏర్పాట్లు చేశారు. యాత్రికులు గొడుగులు వాడాలని, ఎప్పటికప్పుడు నీరు తాగాలని సూచించారు. వారిపై నీళ్లు చిలకరించేలా వాలంటీర్లను నియమించారు. అయినప్పటికీ.. పెద్ద ఎత్తున మరణాలు సంభవించడం గమనార్హం.

Tags

Next Story