Morocco Earthquake: ఎటుచూసినా దయనీయ పరిస్థితే..

భయంకర భూకంపం మిగిల్చిన తీవ్ర విషాదం నుంచి మొరాకో ఇంకా తేరుకోలేదు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో మృత్యుఘోషలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. భూకంప ధాటికి విద్యుత్ సరఫరాతో పాటు అన్ని వ్యవస్థలు దెబ్బతినడంతో కారు చీకట్లు కమ్ముకున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన సహాయక బృందాలు..శిథిలాల కింద సజీవంగా ఉన్న వారితో పాటు మృతదేహాలనూ వెలికి తీస్తూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య2,862 కు చేరింది.2,500కు పైగా తీవ్రంగా గాయపడ్డారు.
మొరాకో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొరాకోపాటు స్పెయిన్, ఖతార్, బ్రిటన్, UAE దేశాల నుంచి తరలివచ్చిన రెస్క్యూ టీంలు.. శిథిలాలు తొలగించే కొద్దీ మృత దేహాలు కనిపిస్తూనే ఉన్నాయి. భూకంప తీవ్రతకు మర్రకేష్, చిచౌవా, టరౌడెంట్ ప్రాంతాల్లో విద్యుత్, రవాణా వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి. ఆహారం, నీరు లేక స్థానికులు అలమటిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలు క్షామంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇళ్లు, భవనాలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు రహదారులపైనే ఉండాల్సి వస్తోంది.
భూకంపం వచ్చి ఇప్పటికే 72 గంటలకు పైనే అయిపోయింది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు సజీవంగా బయటకు వస్తారన్న ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. భూకంపం కేంద్ర ప్రాంతమైన అట్లాస్ పర్వత ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా గుట్టలుగుట్టలుగా శవాలే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో శిథిలాల వెలికితీత ఇప్పటి వరకూ చేపట్టనేలేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని మర్రకేష్ నగరం.. పురాతనమైనది. 12వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా యునెస్కో గుర్తించింది.ఈ ఓల్డ్ సిటీలో మసాలాల మార్కెట్లతో పాటు రాజసౌధాలు ఉన్నాయి. ఇక్కడి ప్రాచీన కౌటౌబియా మసీదుకు దేశ విదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు. భూకంప తీవ్రతకు ఈ మసీదు దెబ్బతింది. మొరాకోలో భూకంపాలు సంభవించడం కొత్తేం కాదు. 60 ఏళ్ల క్రితం సంభవించిన ఓ భూకంపంలో అగాదిర్ ప్రాంతంలో 12 వేల మంది దుర్మరణం చెందారు. 2004, 2016 లలో కూడా ఉత్తర మొరాకోను భూకంపాలు వణికించాయి. ఐతే గత 120 ఏళ్లలో 6.8 తీవ్రతతో మొరాకోలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com