Morocco Earthquake: మొరాకోలో మరణమృదంగం

Morocco Earthquake:  మొరాకోలో మరణమృదంగం
2 వేలు దాటిన మరణాల సంఖ్య

Morocco Earthquakeలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 2 వేలు దాటింది. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. శిథిలాలను వెలికి తీసేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అనేక భవనాలు బీటలు వారాయి. ఈ ప్రకృతి విపత్తులో 2 వేల మందికిపైగా గాయపడ్డారు. వారంతా సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం రాత్రి 11 గంటల 11 నిమిషాల సమయంలో సంభవించిన ఈ భూకంపం చారిత్రక నగరం మారకేష్‌ దాని చుట్టుపక్కల 5 ప్రావిన్సులను భయకంపితులను చేసింది. హై అట్లాస్‌ పర్వతాల వద్ద ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మారకేష్‌ నగరానికి 71 కిలోమీటర్ల దూరంలో హై అట్లాస్‌ పర్వత ప్రాంతాల్లోనే భూకంప కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే మారుమూల ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. భూకంప కేంద్రానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాకో రాజధాని రబాత్‌తో పాటు కాసాబ్లాంకా, అగాదిర్, ఎస్సౌయిరాలో కూడా ప్రకంపనలు సంభవించాయి.

మారకేష్‌లో భూకంపం ధాటికి చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మసీదు కటూబియాకు తీవ్రనష్టం వాటిల్లింది. మసీదులో 69 మీటర్లు ఎత్తైన మీనార్‌ భూకంపం సమయంలో అటు ఇటు ఊగుతూ కనిపించింది. ఒక్క మారకేష్‌లోనే వెయ్యి మందికిపైగా మృతిచెందారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. శిథిలాల కింద సజీవంగా ఉన్న వారు బయటపడేందుకు రానున్న 24 గంటల సమయాన్ని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. చాలా చోట్లకు అంబులెన్సులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

మూడు రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ కింగ్‌ మహమ్మద్‌-6 నిర్ణయం తీసుకొన్నారు. బాధితులకు ఆహారం, పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ప్రజలు అర్ధరాత్రి వీధుల్లోనే గడిపారు. శిథిల భవనాల నుంచి వీలైనన్ని నిత్యావసరాలను ప్రజలు తమతోపాటు తెచ్చుకొన్నారు. మరో వైపు మారకేష్‌ ఎయిర్‌ పోర్టు ప్రయాణికులతో నిండిపోయింది. దేశాన్ని వీడి వెళ్లే యాత్రికులు ఎక్కువగా ఉన్నారు. వారంతా నేలపైనే పడుకొన్నారు. ప్రజలకు సాయం చేసేందుకు మొరాకో సాకర్‌ జట్టు ముందుకొచ్చింది. ఈ జట్టు సభ్యులు క్షతగాత్రుల కోసం రక్తదానం చేశారు.మొరాకోలో గత 120 ఏళ్లలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి.

Tags

Read MoreRead Less
Next Story