CHINA: చైనాలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్

అగ్రరాజ్యంగా అవతరించాలని తహతహలాడుతున్న చైనా అన్ని రంగాల్లో బలమైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కరోనా వల్ల ఆర్థిక రంగం పురోగతి మందగించినా మిగిలిన రంగాల్లో సత్తా చాటి ప్రపంచానికి తమ శక్తి ఏంటో చెప్పాలని భావిస్తోంది. అందుకే అంతరిక్ష రంగంలో డ్రాగన్ తన పరిశోధనలను మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పటికే అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసుకున్న చైనా ఖగోళాన్ని మరింత శోధించేందుకు సిద్ధమైంది. ఖగోళాన్ని సర్వే చేసేందుకు ఉత్తరార్ధ గోళంలోనే అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్‌ను శరవేగంగా అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఖగోళంలో అప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలను పరిశీలించి పరిశోధనలు చేసేందుకు సాధ్యపడుతుందని చైనా వెల్లడించింది.
అంతరిక్షం, ఖగోళాన్ని శోధించడంలో ప్రపంచంతో పోటీ పడుతున్న చైనా.. మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే సుదూర అంతరిక్షం నుంచి రేడియో సిగ్నల్స్‌ను స్వీకరించగల ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ను గుయిజౌ ప్రావిన్సులో డ్రాగన్ నిర్మించింది. ఇప్పుడు ఉత్తరార్ధ గోళంలోనే పెద్దదైన అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్‌ను అభివృద్ధి చేస్తోంది. అన్నీ సజావుగా సాగితే ఈ నెల మధ్యనాటికే ఇది అందుబాటులోకి వస్తుందని చైనా వెల్లడించింది. దీని ద్వారా ఖగోళంలో అప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలను పరిశీలించి, పరిశోధనలు చేయడం సాధ్యపడుతుంది.
దాదాపు 2.5 మీటర్ల వ్యాసంతో ఈ వైడ్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్ WFSTని రూపొందించింది. చైనా శాస్త్రసాంకేతిక విశ్వవిద్యాలయంతో పాటు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధీనంలోని పర్పుల్ మౌంటైన్ అబ్జర్వేటరీ ఈ భారీ టెలిస్కోప్‌ను రూపొందించాయి. WFST అందుబాటులోకి వస్తే పాలపుంత వెలుపల ఉన్న సుదూర నక్షత్ర వీధులతోపాటు వివిధ గెలాక్సీ సమూహాలపై పరిశోధనలు సాగించేందుకు వీలుపడుతుంది. అంతేకాకుండా ఖగోళ సంకేతాలను గుర్తించేందుకు ఈ టెలిస్కోప్‌ని ఉపయోగించుకోవచ్చు. భూ ఉత్తరార్ధ గోళంలోనే ఇది ఒక శక్తిమంతమైన టెలిస్కోప్‌గా అవతరిస్తుందని ప్రాజెక్టు చీఫ్ డిజైనర్ కాంగ్ జు తెలిపారు.
ఈ టెలిస్కోప్ అందుబాటులోకి వస్తే చైనా భూభాగానికి సమీపంలో ఉన్న ఖగోళ వస్తువులు, సిగ్నల్స్‌పై పూర్తి స్థాయిలో దృష్టిసారించేందుకు అవకాశం ఉంటుంది. జులై 2019లోనే లెంఘు పట్టణంలో ఈ WFST టెలిస్కోప్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ పట్టణం 4000 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ పట్టణం అరుణ గ్రహం ఉపరితలాన్ని పోలి ఉండటంతో దీనిని చైనా మార్స్ క్యాంప్ అని పిలుస్తారు. లెంఘు పట్టణం పీఠభూమి ప్రాంతంలో ఉండటం వల్ల స్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రాత్రి పూట ఆకాశం నిర్మలంగా ఉండి పరిశోధనలకు వీలుగా ఉంటుంది. అందుకే టెలిస్కోప్‌ను అక్కడ చైనీయులు నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com