Volcano Erupts : బద్దలైన అగ్నిపర్వతం..పరుగులు పెట్టిన పర్యాటకులు

ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ప్రసిద్ధ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ భారీగా పేలింది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో, పెద్ద మొత్తంలో బూడిద మేఘాలు ఆకాశంలో ఏర్పడ్డాయి. పేలిన అగ్ని పర్వతం అగ్నిని, బూడిదను పొగలను వెదజల్లుతూ సమీప ప్రాంతాలను కమ్మేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో పర్వతం వద్ద ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పక్కనుంచి బూడిద మేఘం విరుచుకుపడుతుండగా తమ ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు భయంతో పారిపోతుండగా, మరికొందరు శాస్త్రజ్ఞులు మాత్రం ఆకాశాన్ని చీల్చే బూడిద మేఘాలను ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు.
అగ్నిపర్వతం బద్దలివ్వడంతో ఏర్పడిన బూడిద మేఘం సమీప పట్టణాలు, గ్రామాలపై విస్తరించింది. రోడ్లు, ఇళ్ళ పైకప్పులు బూడిదతో కమ్ముకుపోయాయి. ప్రజలకు మాస్కులు ధరించమని అధికారులు సూచించగా.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ టూలూస్ (VAAC) మొదట్లో రెడ్ అలర్ట్ జారీ చేసినా, ప్రస్తుతం దాన్ని ఆరెంజ్ హెచ్చరికగా తగ్గించింది. మౌంట్ ఎట్నా 3,300 మీటర్ల ఎత్తులో ఉండే యూరోప్ లో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇటలీ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం గత కొన్ని గంటలుగా మౌంట్ ఎట్నా వరుసగా బూడిద వెదజల్లుతున్నట్లు తెలిపింది.
ఇదే తరహాలో బూడిద, వాయువులు ఇంకా ఎగసిపడతాయనే భయం ఉంది. మౌంట్ ఎట్నా గత ఐదేళ్లుగా చురుకుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బూడిద దట్టంగా ఉండటంతో ప్రజలకు ఆరోగ్య ప్రమాదం ఏర్పడే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com