Bangladesh: : ఢాకాలో భారీగా సైన్యం..

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరోసారి వేగంగా మారుతున్నట్లు కనపడుతుంది. ఇటీవల కాలంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజధాని ఢాకాలో విస్తృతంగా సైన్యం మోహరించినట్లు తెలుస్తుంది. ఇది తిరుగుబాటు ఊహాగానాలను లేవనెత్తుతోంది. ఢాకాలో ఎప్పుడూ లేని విధంగా సైన్యం మోహరించడం చూస్తే ఏదో పెద్ద విషయమే జరగబోతుందనే సందేహాలు వెల్లడవుతున్నాయి.
బంగ్లా సైన్యం, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్, పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించినట్లు తెలుస్తుంది. వీటికి అదనంగా రాజధాని ఢాకాలో భద్రతను పటిష్టం చేయడానికి సమీప జిల్లాల నుంచి పోలీసు సిబ్బందిని తీసుకున్నారు. అయితే, ఇలా ఈ బలగాల మోహరింపు హిజ్బుత్-తహ్రీర్, ఇతర ప్రతిపక్ష గ్రూపులు పిలుపునిచ్చిన నిరసనల్లో ఎలాంటి హింస జరగకుండా నిరోధించడానికి అని పైకి చెబుతున్నప్పటికీ అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.
అయితే, బంగ్లా దేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఇచ్చిన ఉత్తర్వు మాత్రం సందేహాలను మరింతగా పెంచుతోంది. వకార్ రెండు కీలకమైన సైనిక కంటోన్మెంట్ల నుంచి దళాల కదలికలను ఆదేశించారు. రాబోయే కొద్ది రోజుల్లో సాయుధ వాహనాలు, సైనికులు ఢాకా చేరుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఘటైల్ కంటోన్మెంట్ పూర్తి హై అలర్ట్‌లో ఉంచారు. ఇది చూస్తే, సైన్యం నిరసనల నియంత్రణ కన్నా పెద్ద చర్యకు సిద్ధమవుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.
భారత్‌తో సన్నిహిత సంబంధాలు, షేక్ హసీనాతో బంధుత్వం ఉన్న ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి మహ్మద్ యూనస్‌తో పడటం లేదని సమాచారం. యూనస్ ఇస్లామిక్ శక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పాకిస్తాన్‌తో స్నేహంగా ఉండడం ఆర్మీ చీఫ్‌కి నచ్చడం లేదు.
పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఒక సైనిక జనరల్ సైన్యంలో తిరుగుబాటు తెచ్చి వకార్‌ని దించాలనే ప్రయత్నం చేయడం వంటి అంశాలు కూడా వకార్‌ని మరింత అప్రమత్తం చేశాయి. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై అణచివేత చర్యల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మహ్మద్ యూనస్‌కి బలమైన సందేశం ఇవ్వడానికి సైన్యాన్ని కదిలించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com