Afghanistan: అమ్రుల్లాకు షాక్..కొత్త అధ్యక్షుడిగా అబ్దుల్ బరాదర్..?

అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో యూఏఈలో తలదాచుకుంటున్నారు. అధ్యక్షుడు అష్రప్ ఘనీ పారిపోయినా తర్వాత ప్రభుత్వంలో రెండో స్ధానంలో ఉన్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తెరపైకి వచ్చారు. తాలిబన్లకు తలొగ్గేందుకు నిరాకరించారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచిపోయిన నేపథ్యంలో తాను తదుపరి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాదు వచ్చీ రాగానే తాలిబన్లపై తిరుగుబాటు కూడా మొదలుపెట్టేశారు. ఆర్మీతో కలిసి పోరాటాన్ని ముందుకు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఛారికర్ పట్టణంపై ఆర్మీ విరుచుకుపడింది. దీంతో అక్కడ తాలిబన్లు చేతులెత్తేశారు. దీంతో ఛారికర్ పట్ఠణం తిరిగి ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ వశమైంది.
తాలిబన్లు ఆఫ్గన్ హస్తగతం చేసుకోవడంతో ప్రాణభయంతో ప్రజలు ఆ దేశాన్ని వీడి ఇతర దేశాలకు వెళ్లలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తాలిబన్ పాలన ఖాయమే అని తేలినప్పటికీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఇప్పటికే చర్చ మొదలయ్యింది. తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత డిప్యూటీ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కల్లోల అఫ్గాన్ పాలనా పగ్గాలను బరాదర్‌కు కట్టబెట్టేందుకు తాలిబన్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్ల రాజకీయ విభాగం చీఫ్‌గా పలుదేశాలతో సంబంధాలు నెరపడం ఆయనకు అనుకూలించే అంశమని భావిస్తున్నారు. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ 1968లో అఫ్గానిస్తాన్‌లోని ఉరుజ్‌గన్ ప్రావిన్స్‌లో దే రహ్‌వోద్ జిల్లాలో వీత్‌మాక్ అనే గ్రామంలో జన్మించాడు. పుట్టుక రీత్యా సదోజాయ్ తెగకు చెందిన దుర్రానీ పుష్తూన్ వర్గానికి చెందినవాడు. యువకులుగా ఉన్నప్పుడే ముల్లా మహమ్మద్ ఒమర్, బరాదర్ మంచి స్నేహితులయ్యారు.
1980వ దశకంలో కాందహార్ ప్రాంతంలో సోవియట్–అఫ్గాన్ యుద్దంలో బారదార్ పాల్గొన్నాడు. అప్పట్లో సోవియట్ యూనియన్ మద్దతుతో కొనసాగుతున్న అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫ్గాన్ ముజాహిదీన్ అనే సంస్థలో చేరి పోరాటం సాగించాడు. నిజానికి మొదట్లో అతడి పేరు చివరన బరాదర్ లేదు. ప్రాణ స్నేహితుడు, తాలిబన్ వ్యవస్థాపకుడైన ముల్లా మహమ్మద్ ఒమర్ అతడి పేరు చివర బరాదర్(సోదరుడు) అని చేర్చాడు. రక్షణ శాఖ డిప్యూటీ మినిస్టర్‌గా కూడా పనిచేసినట్లు అమెరికాకు చెందిన ఇంటర్‌పోల్ వెల్లడించింది.
సోవియట్–అఫ్గాన్ యుద్దం తర్వాత కాందహార్ ప్రావిన్స్‌లోని మైవాంద్‌లో ఒమర్‌తో కలిసి ఓ మదర్సాను బరాదర్ నిర్వహించాడు. దక్షిణ అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ముఠాను స్థాపించేందుకు ఒమర్‌కు తోడుగా నిలిచాడు. కుడిభుజంగా వ్యవహరించాడు. అఫ్గాన్‌లో 1996 నుంచి 2001 వరకూ కొనసాగిన తాలిబన్ పాలనలో బరాదర్ ఎన్నో కీలక పదవులు దక్కించుకున్నాడు. హెరాత్, నిమ్రుజ్ ప్రావిన్స్‌ల గవర్నర్‌గా పనిచేశాడు. ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా, సెంట్రల్ ఆర్మీ కార్ప్స్ కమాండర్‌గానూ సేవలందించినట్లు తెలుస్తోంది.
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా దాడుల తర్వాత అమెరికా సైన్యం అఫ్గాన్‌పై దండెత్తింది. 2010 ఫిబ్రవరి 8న పాక్ లోని కరాచీలో పట్టుబడ్డాడు. బరాదర్ అరెస్టు తాలిబన్లపై తాము సాగిస్తున్న యుద్ధంలో టర్నింగ్ పాయింట్ అని అమెరికా సైనికాధికారులు వ్యాఖ్యానించారంటే అతడి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం బరాదర్‌ను జైలు నుంచి విడుదల చేసినట్లు 2018 అక్టోబర్ 25న తాలిబన్లు ప్రకటించారు.
అమెరికా ఒత్తిడి కారణంగానే పాక్ ప్రభుత్వం అతడిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. బరాదర్ ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నాడు. దోహాలోని తాలిబన్ దౌత్య కార్యాలయం అధినేతగా నియమితుడయ్యాడు. అమెరికాతో జరిగిన చర్చల్లో తాలిబన్ల తరపున పాల్గొన్నాడు. 2020 ఫిబ్రవరిలో అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించిన దోహా ఒప్పందంపై సంతకం చేశాడు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2021 ఆగస్టు 17న ఖతార్ నుంచి స్వదేశం అఫ్గానిస్తాన్‌కు తిరిగొచ్చాడు. 2001లో తాలిబన్ ప్రభుత్వం పతనమైన తర్వాత అతడు అఫ్గాన్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.
ఈ నేపథ్యంలో తిరిగి పౌర ప్రభుత్వాన్ని తిసుకువచ్చేందుకు అమ్రుల్లా సలేహ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు వేగంగా ముందుకు కదులుతున్నారుు.రెండు మూడు రోజులు శాతంగా తాలిబన్ల అరాచకం మొదలైంది. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం జరిగిన ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట, అమెరికా బలగాల కాల్పుల కారణంగా కోల్పోయిన వారి సంఖ్య 40కి చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com