Myanmar: రెండు వేలు దాటిన మయన్మార్ భూకంపం మృతుల సంఖ్య..

మయన్మార్ భూకంపం ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ విపత్తులో 2,028 మంది మరణించినట్లు మయన్మార్ సైన్యాన్ని ఊటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. సుమారు 3,408 మంది గాయపడ్డట్లు పేర్కొంది. 300 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపింది. అయితే, మయన్మార్ స్టేట్ మీడియా మాత్రం 1700 మంది మరణించినట్లు వెల్లడించింది.
మయన్మార్ దేశాన్ని అత్యంత శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆ తర్వాత కూడా పలుమార్లు భూమి కంపించింది. ఇక ఈ విపత్తులో మయన్మార్ వ్యాప్తంగా రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశముందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com