Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం..

Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం..
X
క్షతగాత్రులతో నిండిపోయిన ఆస్పత్రి

మయన్మార్‌, బ్యాంకాక్‌ను భారీ భూకంపాలు వణికించాయి. రిక్టర్‌ స్కేల్‌పై 7.7, 6.8 తీవ్రతతో శుక్రవారం మధ్యాహ్నం రెండుసార్లు వెంటవెంటనే ప్రకంపనలు సంభవించాయి. ఈ ఘటనల్లో సుమారు 150 మంది మరణించగా, 730 మందికిపైగా గాయపడ్డారని మయన్మార్‌ అధికారిక మీడియా ఎంఆర్‌టీవీ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు. దీంతో మయన్మార్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సాగింగ్‌ నగర వాయువ్యంలో 16 కి.మీ దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్‌ జియలాజికల్‌ సర్వే అధికారులు గుర్తించారు. భూకంపం కారణంగా మయన్మార్‌ రాజధాని నేపిడాలో 1000 పడకల దవాఖాన కుప్ప కూలిపోయింది. పేరు పెట్టని ఈ దవాఖానలో మృతుల సంఖ్య అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. అలాగే మండాలేలో భక్తులు ప్రార్థనల్లో ఉండగా ఒక మసీదు కూలింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. భూకంప ప్రకంపనలు పొరుగునే ఉన్న ఉత్తర థాయ్‌లాండ్‌కు కూడా వ్యాపించడంతో బ్యాంకాక్‌లోని కొన్ని మెట్రో, రైలు సర్వీసులను నిలిపివేశారు. థాయ్‌లాండ్‌ ప్రధాని షినవత్రా బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంపం కారణంగా బ్యాంకాక్‌, ఇతర నగరాల్లోని భవనాలు వణికిన దృశ్యాలు భయోత్పాతం కలిగించాయి. చాలాచోట్ల ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీశారు. వందలాది మంది ఇంకా వీధుల్లోనే ఉండి, ఇళ్లలోకి వెళ్లడానికి భయపడుతున్నారు. బ్యాంకాక్‌లోని చుత్‌చాక్‌ పరిసరాలలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం నిలువునా కూలిపోయింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 78 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.ఎత్తయిన భవనాల నుంచి, చెరువుల నుంచి నీరు పొంగిపొర్లింది. థాయ్‌లాండ్‌లోని భారతీయులకు +66 618819218 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన ట్టు భారత ఎంబసీ తెలిపింది. కాగా, మయన్మార్‌లో ఇర్వాడి నదిపై ఉన్న ఒక పాత బ్రిడ్జితో పాటు, కొన్ని నివాస భవనాలు కూలిపోయాయి. మండలే లోని విమానాశ్రయం బాగా దెబ్బతింది. తాంగ్యీ నగరంలోని ఒక ఆశ్రమం, థాయ్‌లాండ్‌ లోని షాన్‌ రాష్ట్రం దెబ్బతిన్నాయి.

Tags

Next Story