Myanmar: ఆంగ్ సాన్ సూకీకి పాక్షిక క్షమాభిక్ష

పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. బౌద్ధులు ఎక్కువగా ఉన్న మయన్మార్‌లో ‘గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాస’దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మిలటరీ కౌన్సిల్ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ సుమారు 7 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సూకీకి ఆరేళ్లు, మాజీ అధ్యక్షుడు విన్ మైంట్ కు నాలుగేళ్లు జైలు శిక్ష తగ్గనుంది.
1989లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఆమెని తొలిసారిగా గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసినందుకు గానూ 1991లో ఆమెను నోబెల్ బహుమతి వరించింది. 2010లో ఆమెకు గృహనిర్భంధం నుంచి విముక్తి పొందారు. 2015, 2020 మయన్మార్ ఎన్నికలలో ఆమె పార్టీ విజయం సాధించింది. అయితే 2021లో సు ప్రభుత్వాన్ని కూలదోసి బాధ్యతలు చేపట్టిన సైన్యం ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని అనే నెపంతో ఆమెను, ఆమె అనుచరులను జైలుకి పంపింది. మొత్తం ఆమెపై 19కి పైగా కేసులు ఉండడంతో ఆమెకు కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా ప్రకటనతో వీటిలో నాలుగు కేసులను కొట్టేశారు
దీనితో ఆమెకు ఆరేళ్ళ శిక్ష తగ్గింది. ఈ ప్రకటనకు ముందుగానే సోమవారం నాడు ఆమెను ప్రభుత్వ బిల్డింగ్ కు మార్చినట్టు సమాచారం. ఆమెను విడుదల చేయాలన్న అంతర్జాతీయ ఒత్తిడులతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. సూకీకి ఆరేళ్ల జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం, ఆమె మరో 27 ఏళ్లపాటు జైలు జీవితం గడపక తప్పదు. మరోవైపు మయన్మార్‌లో ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్టు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలను జాప్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com