China: చైనాను వణికిస్తున్న అంతుచిక్కని న్యుమోనియా..

China:  చైనాను వణికిస్తున్న అంతుచిక్కని న్యుమోనియా..
డేంజర్‌లో స్కూల్‌ పిల్లలు

కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మరో మహమ్మారి పురుడుపోసుకుంటున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. చైనాలోని బడుల్లో అంతుచిక్కని నిమోనియా వ్యాధి విజృంభిస్తున్నది. బీజింగ్‌, లియోనింగ్‌ నగరాల్లోని దవాఖానలు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో తాజా పరిస్థితులు మునుపటి కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయి. కాగా, మిస్టరీ నిమోనియా వ్యాపిస్తుండటంతో స్కూళ్ల మూసివేత తప్పదని స్థానిక మీడియా వెల్లడించింది. బీజింగ్‌, లియోనింగ్‌ దవాఖానలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నది. బాధిత చిన్నారుల్లో అధిక జ్వరం, ఊపిరితిత్తుల మంట వంటి అసాధారణ లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. అయితే ఇతర శ్వాసకోశ వ్యాధుల్లో కనిపించే దగ్గు, ఇతర లక్షణాలు లేవని వివరించింది.


చైనా దేశంలోని పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులైన న్యుమోనియా వ్యాప్తిపై సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా దేశాన్ని అభ్యర్థించింది. చైనాలో శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ చైనా వైద్యుల్ని కోరింది. అక్టోబరు నుంచి ఉత్తర చైనాలో ఇన్‌ఫ్లుఎంజా వంటి అనారోగ్యం వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చైనాలో కొవిడ్ వ్యాప్తిపై ఆంక్షలను ఎత్తివేయడంతో పిల్లల్లో ఇన్‌ఫ్లుఎంజా వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయని చైనా వైద్యాధికారులు చెప్పారు.న్యుమోనియా లక్షణాలతో బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పిల్లలు ఆసుపత్రుల్లో చేరారు. పిల్లల్లో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి మిస్టరీగా మారిందని వైద్యాధికారులు అంటున్నారు. శిశువులను ప్రభావితం చేసే ఆర్ఎస్‌‌వీ,మైకోప్లాస్మా న్యుమోనియాతో సహా వ్యాధికారక వ్యాప్తిలో ఇటీవలి పోకడలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

అంతుపట్టని న్యుమోనియా నివారణకు టీకాలు వేయించుకోవడం, జబ్బుపడిన వారి నుంచి దూరం ఉంచడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం వంటి నివారణ చర్యలు తీసుకోవాలని చైనా వైద్యాధికారులు ప్రజలకు సూచించారు

Tags

Read MoreRead Less
Next Story