North koria: ఆయుధాల ఉత్పత్తి పెంచండి
యుద్ధానికి సిద్ధం కావాలంటూ మరోసారి గా సైనిక బలగాలను ఆదేశించారు ఉత్తర కొరియా నియంత కిమ్. దేశం అతలాకుతలం అవుతున్నా, కిమ్ మాత్రం ఆరాంగా వెళ్లి తమ సైనిక సంసిద్ధతను పరీక్షించి వచ్చారు.వచ్చే వారం దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన బలగాలను హెచ్చరించారు.
ఉత్తర కొరియా ప్రధాన ఆయుధాల కర్మాగారాలను మరోసారి సందర్శించిన కిమ్. క్షిపణులు సహా మిగిలిన ఆయుధాల ఉత్పత్తిని, భారీగా పెంచాలని ఆదేశించారు. వ్యూహాత్మక క్షిపణులు, మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌లు, సాయుధ వాహనాలు, ఫిరంగి షెల్‌లను ఉత్పత్తి చేసే కర్మాగారాలను ఈ నేపథ్యంలో కిమ్ సందర్శించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఉన్నతాధికారుల బృందంతో కలిసి పర్యాటనలో పాల్గొన్న ఆయన క్షిపణి కర్మాగారంలో ఆయుధ కార్యక్రమాలను మరింత పెంచాలని స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులకు సూచించారు .మిలిటరీ యూనిట్ల అత్యవసర అవసరాలకు అనుగుణంగా క్షిపణులను భారీగా ఉత్పత్తి చేయాలని కూడా ఉత్తర కొరియా అధినేత స్పష్టం చేశారు.
మరోవైపు తుపానుకు అతలాకుతలమైన పలు ప్రాంతాలను కిమ్ పరిశీలించారు.వరదల హెచ్చరికలు ఉన్నప్పటికీ సరైన విధంగా సిద్ధంకాలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కిమ్... అందుతున్న సహాయ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి, కీలక సూచనలు చేశారు. ఇప్పటికీ వరదల వల్ల దాదాపు 200 హెక్టార్ల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు ఈ నెలాఖరులో అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు చేయాలన్న ప్రతిపాదనను దక్షిణకొరియా విరమించుకోవాలని దక్షిణకొరియా దేశంలోని శాంతి కార్యకర్తలు డిమాండ్ చేశారు. సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయం ఎదుట ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు శాంతి కోసం నినాదాలు చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన బల ప్రదర్శన కేవలం విపత్తుతో ముగుస్తుందని.. అందుకే ఈ ప్రదర్శనలు రద్దు చేయాలని కొరియా పీస్ పేర్కొంది. ఈ శాంతి సంస్థలో దక్షిణ కొరియాలోని వందలాది పౌర, మత సమూహాలు, డజన్ల కొద్దీ విదేశాల్లోని యుద్ధ వ్యతిరేక బృందాలున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com