NASA: క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు గడిపిన అనంతరం నలుగురు వ్యోమగాములు సోమవారం తెల్లవారుజామున భూమిపైకి చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ కు చెందిన క్యాప్సూల్...ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరంలో సురక్షితంగా దిగింది . క్యాప్సూల్ ను సహాయ నౌకలోకి తీసుకొచ్చిన అనంతరం నలుగురు వ్యోమగాములు క్షేమంగా బయటకు వచ్చారు.అంతరిక్ష నౌక నీటిలోకి పడ్డ సుమారు గంట తర్వాత క్యాప్సూల్ నుంచి.....సుల్తాన్ అల్-నెయాది చివరిగా బయటికి వచ్చినట్టు నాసా వెల్లడించింది.
గంటలు కాదు.. రోజులు కాదు... అక్షరాల ఆరు నెలలు... అంతరిక్షంలో ప్రయోగాలు చేశారు ఆ నలుగురు. వీరు గత మార్చి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ స్పేస్‌లోనే ఉన్నారు. కక్ష్యలో 186 రోజులు గడిపారు. 200కు పైగా ప్రయోగాలు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఆరు నెలల సాహసయాత్ర తర్వాత భూమికి తిరిగి వచ్చారు.
స్పేస్ స్టేషన్ నుంచి 13 అడుగుల వెడల్పైన క్రూడ్రాగన్ వెహికల్‌లోకి ఆదివారం ప్రవేశించారు. దాదాపు ఒక రోజు భూకక్ష్యలో తిరిగి ఫ్లొరెడాలోని జాక్సన్‌విల్లే సముద్ర తీరం వద్ద ల్యాండ్ సైట్ సమీపంలోకి చేరుకొన్నారు. అర్ధరాత్రి తర్వాత వారి క్యాప్సుల్ సముద్రజలాలపై దిగింది. ఈ ప్రయాణంలో క్రూడ్రాగన్ క్యాప్సుల్ ఒక దశలో గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత... దాని బాహ్య ఉష్ణోగ్రత దాదాపు 19వందల డిగ్రీల వద్దకు దీని చేరుకుంది. క్రూడ్రాగన్ క్యాప్సుల్‌కు అమర్చిన ప్యారాచూట్లు ఓపెన్ కావడంతో... వేగం నెమ్మదించింది. దీంతో మెల్లగా సముద్రంలో పడింది క్రూడ్రాగన్ క్యాప్సుల్. దీనిని డ్రాగన్స్ నెస్ట్ అనే ప్రత్యేకమైన బోట్‌లోకి ఎక్కించారు. అక్కడే వ్యోమగాములకు అన్ని పరీక్షలు నిర్వహించారు.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమికి చేరిన వ్యోమగాముల్లో... ఇద్దరు అమెరికాకు చెందిన వ్యోమగాములు. వీరి పేర్లు స్టీఫెన్ బోవెన్, వారెన్ వుడీ హోబర్గ్. వీరితో పాటు రష్యాకు చెందిన ఆండ్రీ ఫెడ్యావ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన సుల్తాన్ అల్-నెయాడి కూడా ఉన్నారు. సుల్తాన్ అల్-నెయాది... అరబ్ దేశానికి సంబంధించి స్పేస్‌లో ఎక్కువ కాలం గడిపిన మొదటి వ్యక్తి.
వీరి స్థానంలో మరో నలుగురు వ్యోమగాములను రీప్లేస్ చేశారు. నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం కేప్ కెనవెరాల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్‌లోకి నిన్న అడుగుపెట్టారు ఆ నలుగురు వ్యోమగాములు. వారు స్పేష్ స్టేషన్‌కు చేరుకోగానే... అక్కడున్న నలుగురు వ్యోమగాములు.. భూమికి దిగివచ్చారు. ఈ నలుగురు స్థానంలో.. ఇప్పుడు వెళ్లిన ఆ నలుగురు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆరు నెలలపాటు అక్కడే ఉంటారు. ఆ నలుగురిలో ఒకరు నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు డెన్మార్క్, జపాన్, రష్యా దేశస్తులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com