USA: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం

USA: సునీతా విలియమ్స్ రాక మరింత  ఆలస్యం
X
చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా..

తొమ్మిది నెలలకుపైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జంటకు మళ్లీ నిరాశే ఎదురైంది. సుదీర్ఘకాలం తరువాత వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్‌ఎక్స్ కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో క్రూ-10 మిషన్ రూపకల్పన చేశాయి. కానీ, రాకెట్ లాంచ్ ప్యాడ్ లో ప్రయోగానికి సిద్ధమవుతున్నవేళ చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్పేస్‌ఎక్స్ క్రూ-10 ప్రయోగాన్ని రద్దు చేసింది.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి తీసుకురావడానికి నాసా నిరంతరం ప్రయత్నిస్తోంది. నాసా, స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రత్యామ్నాయంగా అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ -9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ-10 మిషన్ సిద్ధమైంది. కేప్ కెనావెరల్‌లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7.48 గంటలకు స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగించాల్సి ఉంది. ఇందులో ఇద్దరు యూఎస్ వ్యోమగాములు, జపాన్, రష్యా నుంచి ఒక్కొక్క వ్యోమగామి మొత్తం నలుగురు వ్యోమగాములు వెళ్లాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం నిలిచిపోయింది.

మిషన్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం వాయిదా వేయడం జరిగిందని నాసా తెలిపింది. నాసా ప్రయోగ వ్యాఖ్యాత డారోల్ నెల్ మాట్లాడుతూ.. హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య ఉత్పన్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నాసా పేర్కొంది.

కొన్నిరోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో సునీత విలియమ్స్, విల్మోర్ మాట్లాడారు. తమకోసం మార్చి 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌక రానుందని, నౌకలో కొత్తగా ఐఎస్ఎస్ లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తరువాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం విఫలం కావటంతో వారు భూమిపైకి వచ్చేది ఎప్పడన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ప్రయోగం వాయిదా తరువాత నాసా కీలక ప్రకటన చేసింది.

రేపు లేదంటే ఎల్లుండి ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు నాసా, స్పేస్ ఎక్స్ ప్రకటించాయి. ఈ ప్రయోగం జరిగిన వారం తరువాత సునీత, విల్మోర్ లు భూమ్మీదకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి.

Tags

Next Story