NATA: ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు నాటా సభ్యుల నివాళి

భారతీయ సంస్కృతి సంప్రదాయాల కీర్తిప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు మనల్ని విడిచి వెళ్లడం చాలాబాధాకరమని నాటా సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నార్తర్న్ వర్జీనియాలోని ఎస్వీ లోటస్ టెంపుల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కళాంజలి పేరుతో ఘనంగా నివాళులర్పించారు.
నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నిర్మాత మరియు దర్శకులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తొలుత తమ్మారెడ్డి భరద్వాజ, మల్లికా రాంప్రసాద్, రమేష్ రెడ్డి లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాటా డిసి మెట్రో విభాగం నుంచి ఆంజనేయ రెడ్డి దొండేటి, సత్య పాటిల్ పాల్గొని ఇటీవల మృతి చెందిన తెలుగు సినీ ప్రముఖులు దాదాసాహెబ్ పాల్కే ఆవార్డు గ్రహీత, కళాతపస్వి కె .విశ్వనాథ్, అలనాటి సినీ నటి జమున, సినీ నేపథ్యగాయని వాణీ జయరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అలాగే తమ నటనతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చిన అలనాటి మేటి నటులు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ, చలపతిరావు, తారకరత్న లను తలచుకుంటూ ఒకే ఏడాది ఇంత మంది ప్రముఖులను కోల్పోవడం బాధాకరమన్నారు. దాదాపు నాలుగు గంటలసేపు నిర్విరామంగా జరిగిన కార్యక్రమంలో వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతానికి చెందిన దేశీ టాలెంట్స్ గాయకుల బృందానికి చెందిన దాదాపు ముప్పై మంది గాయకులు పాల్గొని సభని జయప్రదం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com