Sri Lanka : శ్రీలంకలో పరిస్థితి దారుణం.. ఎటుచూసిన ఆందోళనలు, అల్లర్లే

Sri Lanka : శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే ఆర్ధికంగా కుదేలైన లంకలో ఇప్పుడు నిరసనలు పతాకస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆ దేశ పరిస్థితి మరింత దీనస్థితికి చేరింది. మరోవైపు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ పాఠశాలలు, వ్యాపారాలు కొనసాగనివ్వకుండా నిలిపేశారు నిరసనకారులు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులంతా విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటున్నారు. అధ్యక్షుడు గోటాబాయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
దేశంలో ఎటూ చూసిన ఆందోళనలు, అల్లర్లే! దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. రోడ్లన్నీ నిరసనలతో నిండిపోతున్నాయి. విద్యార్థులు యూనివర్సిటీలు వదిలేసి రోడ్లెక్కుతున్నారు, వేల సంఖ్యలో వాణిజ్య దుకాణాలు, స్కూళ్లు మూతపడ్డాయి. వీటితో పాటు అన్నికార్యకలాపాలు ఆగిపోయాయి. నిరసనల నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్సెపై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయినా.. తాను పదవి నుంచి దిగేది లేదంటున్నారు రాజపక్సే. ప్రజా విశ్వాసంతో అధికారంలోకి వచ్చామని, పదవి నుంచి దిగిపోయేది లేదంటున్నారు.
మరోవైపు.. దేశంలో ఖజానాలో విదేశీ నిధులు అడుగంటాయి. ప్రస్తుతం కేవలం 50 మిలియన్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఆహారం, ఇంధనం దిగుమతి చేసుకోవడం అత్యంత కష్టంగా ఉంది. కొలంబోలోని ప్రధాని రైల్వే స్టేషన్ మూసేశారు. సమీపంలోని టర్మినల్ నుంచి రైళ్లను నడుపుతున్నారు. దేశంలో రవాణా వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే నడుస్తోంది. ఈ పరిస్థితిని బయటపడాలంటే... శ్రీలంకు దశాబ్దాలు పట్టొచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు....
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com