Mark Rutte: మా జోలికి వస్తే వినాశకర పరిణామాలేనన్న నాటో చీఫ్

నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే రష్యాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ కూటమిలోని పోలాండ్‌పై కానీ లేదా మరేదైనా దేశం జోలికిగానీ వస్తే వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుతిన్ అయినా, మరెవరైనా సరే, తాము ఏదైనా సాధించగలమని అనుకుంటే పొరపాటే అవుతుందని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో అమెరికా- రష్యాల మధ్య సాగుతున్న చర్చల్లో మాస్కోదే పైచేయిగా నిలిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"నాటో - పోలాండ్, ఇతర సభ్యదేశాల భద్రతకు కట్టుబడి ఉంది. మాపై దాడి చేసి తప్పించుకోగలమని ఎవరైనా అనుకుంటే అది పెద్ద తప్పిదమే అవుతుంది. మా కూటమి సభ్యులపై ఎవరైనా దాడి చేస్తే, వారిపై పూర్తిస్థాయిలో విరుచుకుపడతాం. మా ప్రతిచర్యతో వినాశకర పరిణామాలు తప్పవు. పుతిన్‌తోపాటు మాపై దాడి చేయాలనే ఉద్దేశం ఉన్న ఇతరులకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను" అని పోలాండ్ పర్యటనలో ఉన్న మార్క్ రుట్టే వ్యాఖ్యానించారు. మరోవైపు పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మాట్లాడుతూ, అమెరికా- రష్యాల చర్చల ఫలితాలు ఏ విధంగా వచ్చినా, వాటికి సిద్ధంగా ఉండటం ముఖ్యమని చెప్పారు.
పుతిన్‌కు అనుకూలంగా చర్చలు!
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో పుతిన్‌కు అనుకూల ఫలితం వస్తుందేమోనని ఐరోపా దేశాల్లో ఆందోళన నెలకొని ఉంది. మాస్కో తన సైన్యాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు, రానున్న సంవత్సరాల్లో ఈ ప్రాంతంలోని ఇతర దేశాలను బెదిరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందేమోనని భయపడుతున్నాయి. ముఖ్యంగా పోలాండ్, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియాలు తీవ్రంగా కలవరపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారమనేదీ ఇతర దేశాలపై రష్యా దాడులకు దారితీస్తుందనే విషయాన్ని తాను ఏ మాత్రం నమ్మడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com