Nelson Mandela: నెల్సన్ మండేలా డే.. ఎందుకు జరుపుకుంటారంటే...

జాతి వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు నెల్సన్ మండేలా. నల్లజాతి సూరీడుగా మారి, ఆకలి చావులు, కరవు కోరలు, దయనీయ పరిస్థితులు, భయంకర రోగాలు, అంతర్యుద్ధాలతో అల్లాడుతున్న చీకటి ఖండం ఆఫ్రికాకు వెలుగు చూపిన మహానీయుడు. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే, పూర్తి ప్రాతినిధ్య ఎన్నికల ద్వారా ఎన్నికైన దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడు మండేలా(Mandela). బానిసలు, అభాగ్యుల్లో భరోసా నింపేందుకు దక్షిణాఫ్రికా (South Africa) నుంచీ గర్జించే సింహంలా దూసుకొచ్చాడు నెల్సన్ మండేలా (Nelson Mandela). అతని ప్రతి మాటా బాణమైంది. ప్రతి పిలుపూ అగ్నికణమైంది. ప్రతి బాట మార్గదర్శనమైంది. ఆ ఉద్యమకాంతిని ఆపడం విదేశీ శక్తుల వల్ల కాలేదు. జైల్లో పెట్టినా ఆ గోడల ప్రతి ధ్వని ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రగిల్చింది. ఇలా ఉప్పెనలా ఎగసిపడి.. ఆఫ్రికా ప్రజల కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన మహనీయుడు నెల్సన్ మండేలా. ఏటా జులై 18న ఆయన పుట్టిన రోజును ఈ ప్రపంచం నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం(Nelson Mandela International Day) లేదా మండేలా దినోత్సవంగా జరుపుకుంటోంది.
నెల్సన్ మండేలా, ఓ స్వాప్నికుడు, శాంతి కాముకుడు, విశ్వ శాంతికి సంకేతం, పీడనకు, దోపిడీకి, భయానికి తావులేని సమాజం కావాలనేది ఆయన కల. దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా కొనసాగిన వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి 27 ఏళ్లు జైల్లోనే ఉన్నవాడు. 21వ శతాబ్దపు విముక్తి ఉద్యమ వీరుడిగా నెల్సన్ మండేలా పేరు ప్రతి ధ్వనిస్తూనే ఉంటుంది.
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా (Nelson Mandela) జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మండేలా గౌరవార్ధం ఆయన పుట్టినరోజున వేడుకలు నిర్వహించాలని 2009, నవంబరు 10న ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న 192 మంది సభ్యులు ఆమోదించగా, ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అలీ ట్రెకి తీర్మానించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNGA) కూడా 2019 నుంచి 2028 వరకు ఉన్న కాలాన్ని నెల్సన్ మండేలా శాంతి దశాబ్దంగా ప్రకటించింది.
అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటం, శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి నెల్సన్ మండేలా రోజును జరుపుకుంటారు. క్లైమేట్, ఫుడ్ అండ్ సాలిడారిటీ అనే థీమ్‌తో 2023 నెల్సన్ మండేలా డేను జరుపుకుంటున్నాం. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారికి అండగా నిలబడేందుకు ఈ రోజును కేటాయించారు. ఈ రోజును ప్రజలు నెల్సన్ మండేలా సాధించిన విజయాలను గుర్తు చేసుకునే రోజుగా పండుగ లాగా జరుపుకుంటారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

