Nepal Elections: నేపాల్‌లో ఎన్నికలు..“జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా

Nepal Elections:  నేపాల్‌లో ఎన్నికలు..“జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా
X
ఎన్నికల కోసం 3 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరింపు

హింసాత్మక “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా హిమాలయ దేశం నేపాల్‌‌లో ఈరోజు ఎన్నికలు జరుగనున్నాయి. గతేడాది సెప్టెంబర్లో యువత ఆందోళన మధ్య అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఈ ఆందోళనల సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది చనిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. రెండు రోజుల నిరసనల్లో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ రాజకీయ చరిత్రలో అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా ఈ ఆందోళనలు నిలిచాయి.

మార్చి 5న జరుగుతున్న ఈ ఎన్నికల్లో అక్కడి ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారు. మొత్తం 3 కోట్ల నేపాల్ జనాభాలో 1.9 కోట్ల మంది ఓటర్లు తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం 3 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. మొత్తం 275 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) [CPN (MC)], నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్-మార్క్సిస్ట్ లెనినిస్ట్) [CPN (UML)], షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ (NC)లు మరోసారి ఎన్నికల బరిలో నిలబడ్డాయి. గత మూడున్నర దశాబ్ధాలుగా ఈ మూడు పార్టీలే నేపాల్‌లో అధికారాన్ని నిర్వహించాయి. అయితే, ప్రతీసారి ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాలే నేపాల్‌ను శాసించాయి. అయితే, ఈసారి ఈ పార్టీతో పాటు యువనేత, నేపాల్‌ రాజధాని ఖాట్మాండు మేయర్‌గా ఉన్న బాలెన్ షా కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది.

Tags

Next Story