Nepal Gen Z protest: అధ్యక్షుడి భవనంలో నిరసనకారుల విధ్వంసం..

Nepal Gen Z protest: అధ్యక్షుడి భవనంలో నిరసనకారుల విధ్వంసం..
X
మంత్రుల ఇళ్లు లక్ష్యంగా దాడులు

నేపాల్‌లో రెండో రోజు కూడా రణరంగంగా మారింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ సోమవారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం దిగొచ్చి బ్యాన్ ఎత్తేసింది. అయితే పోలీసుల కాల్పుల్లో 20 మంది నిరసనకారులు చనిపోయారు. దీంతో మంగళవారం కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. తక్షణమే కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక మంత్రుల ఇళ్లను ముట్టడించి తగలబెట్టారు. తాజాగా అధ్యక్షుడి భవనంలోకి చొరబడి నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఫొటోలు, వస్తువులను పగలగొట్టారు. అలాగే మంత్రుల ఇళ్లు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని ఓలి దుబాయ్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేటు విమానాన్ని సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైద్య పరీక్షల కోసమే ఓలి దుబాయ్ వెళ్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపునిచ్చారు. తాజా పరిణామాలపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించనున్నారు.

ఇక రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 ఎంపీలు మూకుమ్మడి రాజీనామా చేశారు. నిరసనలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

నిరసనలకు కారణం ఇదే..

దేశంలో ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా పలు సోషల్ నెట్‌‌వర్కులపై గత వారం ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఖాట్మండులో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఈ ఘటనలో 20 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ‘‘సోషల్ మీడియాపై నిషేధం కాదు.. అవినీతిపై నిషేధం విధించండి’’ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలుు చేశారు. దాదాపు 10 వేల మందికి పైగా జనాలు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.

Tags

Next Story