Hamas: హమాస్ చెరలో నేపాలీ హిందూ విద్యార్థి మృతి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్-హమాస మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపేశారు. 20 మంది బతికి ఉన్న బందీలను హమాస్ విడుదల చేస్తోంది. బందీల విడుదలతో ఇజ్రాయిల్ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ ఆనందం మాటున ఒక విషాదం కూడా దాగుంది. రెండేళ్ల క్రితం అక్టోబర్ 07,2023లో హమాస్ జరిపిన దాడిలో, కిడ్నాప్‌కు గురైన నేపాల్ హిందూ విద్యార్థి బిపిన్ జోషి మరణించారు. అతడి మృతదేహాన్ని ఇజ్రాయిల్‌కు తిరిగి ఇచ్చారు.
ఇజ్రాయిల్ లోని నేపాల్ రాయబారి ధన్ ప్రసాద్ పండిత్, బిపిన్ జోషి మరణాన్ని ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని టెల్ అవీవ్‌కు తీసుకువస్తున్నట్లు చెప్పారు. జోషితో సహా మరణించిన నలుగురు బందీల మృతదేహాలను హమాస్ ఇజ్రాయిల్‌కు ఇచ్చినట్లు ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ చెప్పారు. నేపాల్‌కు జోషి మృతదేహం తిరిగి పంపించే ముందు, డీఎన్ఏ టెస్ట్ నిర్వహించనున్నారు. నేపాల్ రాయబార కార్యాలయం సమన్వయంతో ఇజ్రాయిలోలో అంత్యక్రియలు నిర్వహించబడుతాయి.
నేపాల్ లోని చిన్న పట్టణం నుంచి జోషి సెప్టెంబర్ 2023లో ఇజ్రాయిల్ వెళ్లారు. అంటే కిడ్నాప్‌కు ఒక నెల ముందే ఆయన ఇజ్రాయిల్ వెళ్లారు. గాజా సరిహద్దుకు సమీపంలోని కబ్బట్జ్ అటుమిమ్‌లో వ్యవసాయం అధ్యయనం, వర్క్ ప్రోగ్రామ్ కోసం 16 మంది తోటి విద్యార్థులతో చేరారు. ఇజ్రాయిల్ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేయడాని, శిక్షణ తీసుకోవడానికి అక్కడి వెళ్లాడు.
అక్టోబర్ 7, 2023 లో దక్షిణ ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసింది. దాడి తర్వాత సైరన్లు మోగగా విద్యార్థులు బాంబు షెల్టర్‌లోకి వెళ్లారు. క్షణాల్లో కాల్పులు, పేలుళ్లు చెలరేగాయి. హమాస్ ఉగ్రవాదులు షెల్టర్‌లోకి గ్రెనేడ్లనె విసిరారు. ఒకటి పేలడంతో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. అయితే రెండో గ్రెనేడ్‌ను జోషి పట్టుకుని, అది పేలి పోమే ముందు బయటకు విసిరారు. దీని తర్వాత, అతడిని హమాస్ ఉగ్రవాదులు బంధించి, గాజాలోకి తీసుకెళ్లారు. చివరి సారిగా, ఇజ్రాయిల్ సైన్యం విడుదల చేసిన వీడియోలో జోషిని గాజాలోని షిఫా ఆస్పత్రిలోకి లాగుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో అతను సజీవంగా ఉన్నాడు. జోషి సజీవంగా తిరిగి వస్తాడని కుటుంబం భావించింది. చివరకు విషాదం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com